Madras High Court: అర్చకత్వానికి కులం అడ్డుకాదని మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. అర్చకత్వానికి కులంతో పని లేదని, ఎవరైనా అర్చకులు కావచ్చంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ద్విసభ్య ధర్మాసనం సమర్థించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేయడం కుదరదని ధర్మాసనం స్పష్టం చేసింది. సేలం సుకవనేశ్వరాలయంలో అర్చకుల నియామకానికి సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఆలయ యాజమాన్యం 2018లో ప్రకటన వెలువరించగా, దాన్ని వ్యతిరేకిస్తూ అదే ఆలయంలో పని చేస్తున్న సుబ్రమణ్య గురుకల్ హైకోర్టును ఆశ్రయించాడు. ఆలయంలో ఆగమశాస్త్రాల ప్రకారం పూజలు నిర్వహిస్తున్నామని, అర్చక వృత్తికి ఆగమ విధానాలపై కనీస జ్ఞానం లేనివారిని ఆహ్వానించడం సరికాదని, అందువల్ల ఆలయ యాజమాన్యం చేసిన ప్రకటనను రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి … అర్చకవృత్తికి కులం అడ్డు కాదంటూ గతంలో తీర్పు వెల్లడించారు. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ పిటిషనర్ అప్పీలు చేశారు.
Read also: Nallapareddy: బాబు, పవన్‌కు మతిభ్రమించింది.. వాళ్లు సీఎంలు అయ్యేదే లేదు..!
అప్పీలు పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గంగాపూర్‌వాలా, న్యాయమూర్తి జస్టిస్ ఆదికేశవులుతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆగమశాస్ర్తాలు పాటించే ఆలయాల్లో వంశపారంపర్యంగా వచ్చే అర్చకులను మాత్రమే నియమించాలని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా ఉందన్నారు. అప్పుడు ప్రభుత్వం తరఫున ఆర్.షణ్ముగసుందరం వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ గతంలో కూడా ఇలాంటి పిటిషన్లు దాఖలు చేశారన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2405 అర్చక పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అప్పుడు జోక్యం చేసుకున్న ధర్మాసనం.. దీనిపై ఇప్పటి వరకూ నివేదిక సమర్పించలేదని, సేలం సుకవనేశ్వరాలయంలో అమలు చేస్తున్న ఆగమ విధివిధానాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేగాక దేవాదాయశాఖ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబరు 22వ తేదీకి వాయిదా వేసింది.