Site icon NTV Telugu

Presidential elections: ఏకగ్రీవం కోసం బీజేపీ ప్రయత్నాలు.. రంగంలోని జేపీ నడ్డా

Draupadi Murmu

Draupadi Murmu

రాష్ట్రపతి ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. ఇప్పటికే ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ఆదివాసీ మహిళ, మాజీ గవర్నర్ ద్రౌపతి ముర్మును ఖరారు చేశారు. అయితే సమీకరణాలు ఎలా ఉన్నా ద్రౌపతి ముర్ము విజయం సాధిస్తుందనేది ఖాయం. ఇప్పటికే వైసీపీ, బిజూ జనతాదళ్ పార్టీలు ముర్ముకు మద్దతు ప్రకటించాయి. దీంతో ఎన్డీయే బలంలో కలుపుకుని 50 శాతం కన్నా ఎక్కువ ఓట్లే ద్రౌపతి ముర్ముకు పడుతాయి. అయితే బీజేపీ మాత్రం రాష్ట్రపతి ఎన్నికలను ఏకగ్రీవం చేసేలా ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పటికే ఈ బాధ్యతను బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించారు. ఆయన ఇప్పటికే విపక్షాలకు చెందిన పలువురు నాయకులతో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికలను ఏకగ్రీవం చేసేలా ప్రయత్నాలు ప్రారంభించారు.  జేపీ నడ్డా, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని జేడీఎస్ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడతో మాట్లాడారు. వీరితో పాటు కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, అధీర్ రంజన్ చౌదరి తో పాటు ఫరూక్ అబ్దుల్లా తో నడ్డా మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపతి ముర్ముకు  సపోర్ట్ చేయాలని కోరారు. రాష్ట్రపతి ఎన్నికల్లో రాజకీయం ఉండకూడదని కోరారు.

మరోవైపు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము కూడా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. పలు రాజకీయ నాయకులను కలుస్తూ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. బిజూ జనతాదళ్, ఏఐడీఎంకే పార్టీలకు చెందిన నేతల్ని కలిశారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మద్దతు కూడా కోరనున్నట్లు తెలిసింది. దేశ వ్యాప్తంగా రేపటి నుంచి పర్యటిస్తూ పలు పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు ముర్ము.

ఇదిలా ఉంటే ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో నిలుస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఎన్డీయేతర పార్టీలు యశ్వంత్ సిన్హాకు ఎంతమేర మద్దతు ఇస్తాయో చూడాలి. అయితే ఇటీవల మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన విపక్షాల సమావేశానికి కాంగ్రెస్ హాజరుకావడంతో ఆప్, టీఆర్ఎస్ పార్టీలు హాజరుకాలేదు.

 

 

Exit mobile version