Odisha: ఒడిశాలో గర్భంతో ఉన్న ఒక ప్రభుత్వ మహిళా ఉద్యోగికి సెలవు నిరాకరించడంతో కడుపులోని బిడ్డను కోల్పోవాల్సి వచ్చింది. కేంద్రపరా జిల్లాలో తన కార్యాలయంలో తీవ్ర ప్రసవవేదన అనుభవించిన మహిళ పురిటిలోనే బిడ్డను కోల్పోయింది. ఈ ఘటన అక్టోబర్ 25న జరిగింది. చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్(సీడీపీఓ) సెలవు నిరాకరించడంతో తాను బిడ్డను కోల్పోయినట్లు బర్షా ప్రియదర్శిని అనే 26 ఏళ్ల మహిళ మీడియాకు చెప్పడంతో మంగళవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Read Also: India-China border: లడఖ్‌లో భారత్, చైనా బలగాల ఉపసంహరణ పూర్తి!
తాను 7 నెలల గర్భంతో ఉన్నానని, పనిలో ఉండగా విపరీతమైన నొప్పి వచ్చిందని ఆమె చెప్పారు. తనను ఆస్పత్రికి తరలించాలని సీడీపీఓ స్నేహలతా సాహూని, ఇతర అధికారుల్ని కోరినప్పటికీ పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. స్నేహలత తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిందని బార్షా పేర్కొంది. బర్షా బందువులు ఆమెను కేంద్రపరాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆల్ట్రా సౌండ్ స్కాన్ చేయగా, అప్పటికే బిడ్డ చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు.
కేంద్రంపరా డిస్ట్రిక్ట్ అడిషనల్ కలెక్టర్ నిలు మోహపాత్ర మాట్లాడుతూ.. దీనిపై ఫిర్యాదు అందిందని, దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిని ఆదేశించినట్లు చెప్పారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై ఉపముఖ్యమంత్రి ప్రవతి పరిదా స్పందించారు. దీనిపై కేంద్రపరా కలెక్టర్‌తో చర్చించినట్లు వెల్లడించారు. బాధితురాలికి న్యాయం చేస్తామని అన్నారు. అయితే, ఈ ఆరోపణలపై సీడీపీఓ స్పందిస్తూ బార్షా విషయం తనకు తెలియదని చెప్పారు.