Site icon NTV Telugu

Prashant Kishor: బీహారీయులు కొత్త ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు

Prashant Kishor

Prashant Kishor

బీహారీయులు కొత్త ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తెలిపారు. బీహార్‌లో తొలి విడతలో భారీగా పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం రెండో విడత ఎన్నికల కోసం ఉధృతంగా ప్రచారం సాగుతోంది. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడారు. దేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీహార్‌లో అత్యధిక ఓటింగ్ నమోదైందని.. ఇంత శాతం నమోదు అవుతుందని ఎవరూ ఊహించలేదన్నారు. బీహార్‌లో కచ్చితంగా మార్పు వస్తుందని పోలింగ్ శాతాన్ని బట్టి అర్థమవుతుందని తెలిపారు. ప్రధాని మోడీకి చెప్పడానికి ఏమీ లేకపోవడంతో ఆర్జేడీని బూచిగా చూపించి ఓట్లు పొందుతున్నారని ఆరోపించారు. కానీ ఈసారైతే పరిస్థితి మారిపోయిందని.. జంగిల్ రాజ్ తిరిగి రాకూడదని చెబుతున్న మోడీ.. ఎన్డీఏకు ఎందుకు ఓట్లు వేయాలని అడిగారు. ఆ రెండు కూటమిలకు ప్రత్యామ్నాయంగా ప్రజలు జన్ సురాజ్ పార్టీని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: PM Modi: వారణాసిలో 4 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోడీ

గతంలో వలస కార్మికులంతా ఎన్డీఏకు ఓటు వేశారని.. కానీ నేడు అలా కాదని.. బీహారీయులు ఫ్యాక్టరీలు, ఉద్యోగాలు కోరుకుంటున్నారని చెప్పారు. బీహార్‌లో ఫ్యాక్టరీలకు భూమి లేదని అమిత్ షా అంటున్నారని.. అలాగైతే పంజాబ్, బెంగాల్‌ను గుజరాత్‌లో కలిపే పెద్ద రోడ్లను నిర్మించడానికి బీహార్‌లో భూమి ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించారు. రోడ్లు, జాతీయ రహదారులను నిర్మించడానికి బీహార్‌లో భూమి దొరుకుతుంది కానీ.. బీహార్ పిల్లల కోసం ఫ్యాక్టరీలు నిర్మించడానికి మాత్రం భూమి దొరకడం లేదా? అంటూ ప్రశాంత్ కిషోర్ నిలదీశారు.

ఇది కూడా చదవండి: Mali: మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్.. ఐసిస్ గ్రూప్‌పై అనుమానాలు

బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తొలి విడత పోలింగ్ నవంబర్ 6న ముగిసింది. 64.66 శాతం పోలింగ్ నమోదైంది. ఇక రెండో విడత పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ప్రధానంగా ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య పోటీ నెలకొంది.

Exit mobile version