రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పీడ్ పెంచారా? మోడీకి వ్యతిరేకంగా అందరినీ ఏకం చేస్తున్నారా? రాహుల్, ప్రియాంకతో భేటీకి కారణం అదేనా? పంజాబ్ రాజకీయాలపై ఈ మీటింగ్ జరిగిందని అంతా చెబుతున్నా… కారణం మాత్రం అదేనన్న చర్చ నడుస్తోంది. పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకతో భేటీ అయ్యారు. అయితే పంజాబ్ రాజకీయాలపై ఈ మీటింగ్‌లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పంజాబ్‌లో సిద్దూ, అమరీందర్ మధ్య వివాదం ముదురుతోంది. ఎన్నికలకు ముందు రెండు వర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ సమయంలో రాహుల్, ప్రియాంకలతో పీకే భేటీ హాట్ టాపిక్‌గా మారింది.
read also : హుజురాబాద్ ఉప ఎన్నిక : రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
సిద్దూ, అమరీందర్ మధ్య సాగుతున్న పోరుతో పార్టీకి తీవ్ర నష్టమని నేతలు చెబుతున్నారు. అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్నా.. అధినాయకత్వం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఇప్పటికే సిద్దూతో రాహుల్, ప్రియాంకలు పలుసార్లు భేటీ అయ్యారు. ఇటీవలే కాంగ్రెస్ అధినేత్రి సోనియా అమరీందర్ సింగ్ కలిశారు. సిద్దూకి పీసీసీ ఇస్తారని.. అమరీందర్ కేబినెట్ పునర్‌వ్యవస్థీకరిస్తారనిన ప్రచారం జరిగింది. కానీ ఇప్పటికీ ఆ దిశగా అడుగు పడలేదు. అయితే పీకే భేటీతో దీనికి ఏదైనా పరిష్కారం దొరుకుతుందా..? అని భావిస్తున్నారు. 2017 ఎన్నికల్లో అమరీందర్‌కి ప్రశాంత్‌కిశోర్ రాజకీయ వ్యూహకర్త వ్యవహరించారు. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కూడా ఆయన పీకేతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు ప్రశాంత్ కిశోర్.. రాహుల్, ప్రియాంకలను కలవడం కూడా ఆసక్తికరంగా మారింది.
మరోవైపు పంజాబ్ రాజకీయాలపైనే ఈ భేటీ సాగిందని చెబుతున్నప్పటికీ.. దీని వెనుక భారీ వ్యూహం ఉండొచ్చని భావిస్తున్నారు. ఇటీవలే శరద్ పవార్‌తో పీకే వరుస భేటీలు నిర్వహించారు. అటు ప్రశాంత్‌కిశోర్‌తో సమావేశానికి హాజరయ్యేందుకు ప్రియాంక.. యూపీలో కీలక మీటింగ్‌ను రద్దు చేసుకున్నారు. గత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పీకేతో జత కట్టిన రాహుల్ , ప్రియాంకలు… మరోసారి భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ఇటు మోడీ వ్యతిరేక శక్తుల్ని ఏకం చేసేందుకు సాగుతున్న ప్రయత్నంగా కూడా చెబుతున్నారు.
