Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్‌మెంట్.. సెల్‌లో మొబైల్, పెన్‌డ్రైవ్ స్వాధీనం

Prajwal Revanna

Prajwal Revanna

Prajwal Revanna New Case: పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెల్‌లో మొబైల్ ఫోన్ లభించడం కలకలం రేపింది. ప్రముఖ ఖైదీల బ్యారక్‌లలో సోదాలు నిర్వహించిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB) అధికారులు రేవన్న ఉన్న సెల్ నుంచి మొబైల్ ఫోన్‌తో పాటు పెన్‌డ్రైవ్, ఛార్జర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై రేవన్నతో పాటు అదే జైలులోని విచారణ ఖైదీ ప్రతాప్ రాయ్‌పై కొత్తగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

నాలుగు నుంచి ఐదు గంటల పాటు సోదాలు
ప్రముఖ ఖైదీలకు సంబంధించిన బ్యారక్‌లలో భాగంగా సోమవారం CCB బృందం జైలులో విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. సుమారు నాలుగు నుంచి ఐదు గంటల పాటు కొనసాగిన ఈ సోదాల్లో మొబైల్ ఫోన్, పెన్‌డ్రైవ్, ఛార్జర్ లభించాయి. ఇతర అక్రమ వస్తువులు ఏవీ లభించలేదని అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న పరికరాలు జైలులోకి ఎలా వచ్చాయనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.

జైలు అధికారిపై చర్యలు
ప్రజ్వల్ రేవణ్ణ సెల్‌లో నిషేధిత ఎలక్ట్రానిక్ పరికరాలు లభించడంతో జైలు యంత్రాంగం చర్యలకు దిగింది. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అసిస్టెంట్ సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేశారు. జైలు సూపరింటెండెంట్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. జైలులో భద్రతా నిబంధనలు ఉల్లంఘించి మొబైల్ ఫోన్ వంటి పరికరాలు ఖైదీ వద్దకు ఎలా చేరాయనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

అత్యాచారం కేసులో జీవిత ఖైదు
ప్రజ్వల్ రేవణ్ణకు 2025 ఆగస్టులో బెంగళూరులోని ప్రత్యేక కోర్టు అత్యాచారం కేసులో దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది. అత్యాచారంతో పాటు లైంగిక వేధింపులు, వాయురిజం, బెదిరింపులు, సాక్ష్యాలను నాశనం చేయడం, ఐటీ చట్టంలోని నిబంధనల కింద కూడా ఆయనను దోషిగా నిర్ధారించింది. కోర్టు తీర్పులో బాధితురాలి వాంగ్మూలంతో పాటు DNA, డిజిటల్, ఫోరెన్సిక్ ఆధారాలను పరిగణనలోకి తీసుకుంది.

2024లో వెలుగులోకి వచ్చిన కేసులు
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అభ్యంతరకర వీడియోలు బహిర్గతం కావడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయనపై పలు లైంగిక నేరాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. రేవణ్ణ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ వీడియోలు మార్ఫింగ్ చేసినవని వాదించారు. 2024లో ఆయనపై నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని, బెంగళూరులో సైబర్ క్రైమ్‌కు సంబంధించి రెండు కేసులు కూడా నమోదైనట్లు సమాచారం. ఆయన తండ్రి హెచ్.డి. రేవణ్ణపై కూడా ప్రత్యేక కేసు నమోదైంది. ప్రస్తుతం జైలులో నిషేధిత మొబైల్ ఫోన్, పెన్‌డ్రైవ్, ఛార్జర్ లభించడంతో ప్రజ్వల్ రేవణ్ణపై మరో కేసు నమోదైంది. ఈ పరికరాలు జైలులోకి ఎలా చేరాయి, వాటిని ఎలా ఉపయోగించారు, మరెవరైనా ఇందులో సహకరించారా అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.