Madras High Court: లైంగిక పటుత్వ పరీక్ష(పొటెన్సీ టెస్ట్)కు అనుసరిస్తున్న విధానాల్లో మార్పు తీసుకురావాలని మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సైన్స్ అభివృద్ధి చెందిందని, వీర్య నమూనాలు సేకరించాల్సిన అవసరం లేదని, కేవలం నిందితుడి రక్తనమూనాలను ఉపయోగించి పొటెన్సీ టెస్ట్ నిర్వహించేందుకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని రూపొందించాలని అధికారులకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
టూ ఫింగర్ టెస్ట్ నిలిపివేయబడుతుందని నిర్ధారించుకోవాల్సి అసవసరాన్ని కోర్టు నొక్కి చెప్పింది. లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం, జువైనల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్) చట్టం అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటైన న్యాయమూర్తులు ఎన్ ఆనంద్ వెంకటేష్, సుందర్ మోహన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ జూలై 7న ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మైనర్ బాలిక మరియు అబ్బాయికి సంబంధించిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కూడా ధర్మాసనం విచారిస్తున్న క్రమంలో ఈ ఆదేశాలు ఇచ్చింది.
మద్రాస్ హైకోర్ట్ బెంచ్..‘‘ మేము టూ ఫింగర్ టెస్ట్ పరీక్ష, ఆర్కైక్ పొటెన్సీ టెస్టు నిలిపివేయబడతాయని నిర్ధారించుకోవాలని అనుకుంటున్నాము. వివిధ జోన్ల ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు సూచనల ద్వారా డేటాను సేకరించమని ఆదేశించాలని డీజీపీని ఆదేశించాం. జనవరి 1, 2023 నుంచి ప్రారంభమయ్యే అన్ని కేసుల్లో లైంగిక నేరానికి సంబంధించి మెడికల్ రిపోర్టులు తయారుచేయబడుతాయి. ఏదైనా పరీక్షలో టూ ఫింగర్ టెస్ట్ ఉందో లేదో చూడండి. అటువంటి నివేదిక ఏదైనా గుర్తించబడితే, అది కోర్టు దృష్టికి తీసుకురాబడుతుంది, దాన్ని మేము స్వీకరించి తరుపరి ఉత్తర్వులు జారీ చేస్తాం.
అలాగే లైంగిక నేరాల్లో నేరస్థుడికి నిర్వహిస్తున్న స్పెర్మ్ సేకరించే విధానం గతంలో నిర్వహించే పద్దతి. సైన్స్ ప్రస్తుతం కాలంలో చాలా అభివృద్ధి చెందింది. కేవలం రక్తనమూనాల ద్వారా ఈ పరీక్ష నిర్వహించడం సాధ్యమవుతుంది. ఇటువంటి అధునాతన పద్ధతులు ప్రపంచవ్యాప్తంగా అనుసరించబడుతున్నాయి. మనం కూడా అభివృద్ధి చెందాలి. రక్తనమూనాలను సేకరించడం ద్వారా పొటెన్సీ టెస్ట్ నిర్వహించడం కోసం ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించాలి.’’ అని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు 11కి ధర్మాసనం వాయిదా వేసింది.