Shobha Karandlaje: బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజేపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. మార్చి 1న బెంగళూర్‌లో జరిగిన రామేశ్వరం కేఫ్ పేలుడును ఉద్దేశిస్తూ.. తమిళనాడు నుంచి వచ్చిన వ్యక్తి బాంబు పెట్టాడని వ్యాఖ్యలు చేశారు. తమిళులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని బుధవారం పోల్ ప్యానెల్ ఆదేశించింది. కరంద్లాజే ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని డీఎంకే ఫిర్యాదు చేయడంతో కేంద్రం ఎన్నికల సంఘం కర్ణాటక ఎన్నికల అధికారి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ అంశంపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని కోరింది.
Read Also: Congress: హస్తం గూటికి చేరిన బీఎస్పీ సస్పెండ్ ఎంపీ
మంగళవారం కరంద్లాజే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బెంగళూర్‌లో ఓ యువకుడు హనుమాన్ చాలీసా పెట్టినందుకు మరోవర్గానికి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడింది. దీనిపై బీజేపీ నిరసనకు పిలుపునిచ్చింది. పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు నేతలు బాధితుడికి సంఘీభావం తెలిపేందుకు వచ్చారు. ఆ సమయంలో కరంద్లాజే మాట్లాడుతూ..‘‘కర్ణాటకలో శాంతిభద్రతలు క్షీణించాయని, తమిళనాడు నుంచి వచ్చే వారు బాంబులు వేస్తారని, ఢిల్లీ నుంచి వచ్చిన వారు పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేశారని, కేరళ నుంచి వచ్చిన వ్యక్తులు యాసిడ్ దాడులకు పాల్పడ్డారు’’ అని ఆమె అన్నారు. దీంతో వివాదం రాజుకుంది.