ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ‘Cockroach Janata Party’.. ఈసీకి అప్లికేషన్! అప్లై చేసింది ఎవరో తెలుసా?

Cockroach Janata Party

Cockroach Janata Party

Cockroach Janata Party: సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఇప్పుడు డిజిటల్ స్క్రీన్ దాటి ఏకంగా భారత ఎన్నికల సంఘం (ECI) గడప తొక్కింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యల నేపథ్యంలో మే 16న కేవలం ఒక సెటైరికల్ ఆన్‌లైన్ గ్రూపుగా స్టార్ట్ అయిన ఈ ‘సీజేపీ’, ఇప్పుడు అధికారిక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందేందుకు రెడీ అవుతుంది. హర్యానాలోని పానిపట్‌కు చెందిన 35 ఏళ్ల న్యాయవాది సుధీర్ జాఖర్, ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ని రాజకీయ పార్టీగా నమోదు చేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు సమర్పించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 29A కింద ఆయన ఈ అప్లికేషన్ దాఖలు చేశారు. అంతే కాకుండా, ఈ పార్టీకి తనను తాను జాతీయ కన్వీనర్‌గా ప్రతిపాదించుకున్నారు.

న్యాయవాది సుధీర్ జాఖర్ తన దరఖాస్తులో ‘బొద్దింక’ లోగోను పొందుపరిచారు. ఈసీ నిబంధనల ప్రకారం ‘బొద్దింక’ గుర్తు కేటాయించడం సాధ్యం కాకపోయినప్పటికీ.. ఈ వింత పార్టీ రిజిస్ట్రేషన్ వెనుక ఒక బలమైన కారణం కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఎన్నికల సంఘం సుధీర్ జాఖర్ పేరు మీద ‘సీజేపీ’ని రిజిస్టర్ చేస్తే, కోట్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న ఈ పార్టీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై ఆయన చట్టబద్ధమైన హక్కులను పొందే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా జాఖర్ మాట్లాడుతూ.. ప్రజా కేంద్రీకృత ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ విధులను ప్రోత్సహించడానికే ఈ పార్టీ అంకితమవుతుందని స్పష్టం చేశారు. పౌరుల ప్రాథమిక విధులపై అవగాహన కల్పించడమే తమ ప్రాథమిక లక్ష్యమని ఆయన వివరించారు.

‘వ్యవస్థాపకుడు విదేశాల్లో ఉన్నారు.. అందుకే నేనే రంగంలోకి దిగా’
ఈ సరికొత్త పొలిటికల్ ట్విస్ట్‌పై సుధీర్ జాఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీజేపీ ఒరిజినల్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే (Abhijeet Dipke) ప్రస్తుతం విదేశాల్లో (బోస్టన్ యూనివర్సిటీలో) ఉన్నారని, ఆయన ఎప్పుడు తిరిగి వస్తారో ఎవరికీ తెలియదని చెప్పారు. దేశవ్యాప్తంగా యువతలో ఈ పార్టీపై విపరీతమైన క్రేజ్ పెరిగిపోయిందని, ఎవరో ఒకరు దీనిని దుర్వినియోగం చేయకముందే తానే స్వయంగా ఒక రాజకీయ వేదికను కల్పించడానికి ఈ చర్య తీసుకున్నానని ఆయన వెల్లడించారు. అయితే ఈ కొత్త పార్టీ భారత రాజ్యాంగం, సామ్యవాదం, లౌకికవాదం, ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిధిలోనే పనిచేస్తుందని, మతం, కులం, లింగం, భాషా బేధాలు లేకుండా సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొని శాంతియుతంగా పనిచేస్తుందని తన దరఖాస్తులో ఆయన పేర్కొన్నారు. ఈసీ ఆదేశాలు జారీ చేసిన వెంటనే పార్టీ రాజ్యాంగం, అఫిడవిట్, సభ్యత్వ వివరాలను సమర్పిస్తామని తెలిపారు.

ఎవరీ సుధీర్ జాఖర్?
ఈ వింత పార్టీని రిజిస్టర్ చేయాలని కోరిన 35 ఏళ్ల న్యాయవాది సుధీర్ జాఖర్ గతంలో విద్యార్థి నాయకుడిగా కూడా పనిచేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు వ్యతిరేకంగా జరిగిన చారిత్రాత్మక రైతుల నిరసనలలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. ఆ రైతు ఉద్యమ సమయంలో తనపై పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయని జాఖర్ స్వయంగా వెల్లడించారు. ఇక ‘కాక్రోచ్ జనతా పార్టీ’ విషయానికి వస్తే కేవలం ఒక ఆన్‌లైన్ సెటైరికల్‌గా స్టార్ట్ అయిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అనే పేరు నిజానికి డిజిటల్ ప్రపంచంలో దావానంలా వ్యాపించింది. కేవలం ఒక్క వారంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 2 కోట్లకు (20 Million) పైగా ప్రజలు ఈ పేజీని ఫాలో అవ్వడం గమనార్హం. దేశంలో నిరుద్యోగం, విద్యా వ్యవస్థలోని లోపాలపై వ్యంగ్యంగా మీమ్స్ వేస్తూ Gen Z, మిలీనియల్స్‌ను ఈ గ్రూప్ విపరీతంగా ఆకర్షించింది. ఇప్పుడు ఈ డిజిటల్ ప్రచారం నేరుగా ఎలక్షన్ కమిషన్ ముందుకు వెళ్లడంతో దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు దారితీసింది. చూడాలి మరి.. ఈ దరఖాస్తుపై ఈసీ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేస్తుంది అనేది.