Police Lathi Testing: పోలీసులు అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది వారు ఉపయోగించే ‘‘లాఠీ’’. అయితే, ఇవి పోలీసుల వద్దకు చేరాలంటే కఠిన పరీక్షలకు గురవుతాయి. లాఠీ ఛార్జ్ చేసే సమయంలో చేసినట్లే, ఆ లాఠీలను మనుషులపై పరీక్షిస్తారని ఎంత మందికి తెలుసు. ఒక లాఠీని ఉపయోగించడానికి ముందు దానిని అనేక విధాలుగా పరీక్షిస్తారు. పోలీసులు గతంలో వెదురు లాఠీలను ఉపయోగించే వారు. కానీ ఇప్పుడు పాలికార్బోనేట్ లాఠీలను వాడుతున్నారు. ఈ లాఠీల కోసం టెండర్లు జారీ చేసినప్పుడు, వాటికి పరీక్షలు తప్పనిసరి. ఇవి అన్ని టెస్టు పాస్ అయిన తర్వాతే పోలీసుల వద్దకు చేరుతాయి.
ఎలా పరీక్షిస్తారు?
పోలీసు లాఠీలను రెండు విధాలుగా పరీక్షిస్తారు. ఒకటి మనుషులపై, మరొకటి వీధుల్లో రోడ్లపై కొట్టి దాని నాణ్యతను పరీక్షిస్తారు. కొన్ని పరీక్షల్లో సాధారణ దుస్తులు ధరించిన వ్యక్తుల శరీరంలోని వివిధ భాగాలపై లాఠీతో కొట్టి దాని ప్రభావాన్ని అంచనా వేస్తారు. అయితే తల, మెడ, ముఖం, గజ్జలు వంటి సున్నిత ప్రాంతాలను మినహాయిస్తారు. దెబ్బ వల్ల కలిగే నొప్పి, ప్రభావాన్ని అంచనా వేస్తారు. మరో పరీక్షలో లాఠీని గట్టి ఉపరితలంపై బలంగా 25 సార్లు కొడుతారు. దీని వల్ల లాఠీ విరిగిందా.? దెబ్బతిన్నదా? అనే విషయాన్ని పరిశీలిస్తారు. లాఠీ నాణ్యత, మన్నిక పరీక్షించడానికి ఈ పరీక్షలు చేస్తారు.
పోలీస్ టెండర్లలో లాఠీ పొడవు, బరువు, వ్యాసం, మందం వంటి అంశాలను నిర్దేశిస్తారు. పాలికార్బోనేట్ లాఠీ సుమారు 1 మీటర్ పొడవు, 350 గ్రాముల వరకు బరువు, 2.5 సెం.మీ వ్యాసం, 4 మి.మీ గోడ మందం కలిగి ఉండవచ్చు.

