NTV Telugu Site icon

MP Awadhesh Prasad: అయోధ్య ఎంపీ అవధేష్ ప్రసాద్ కుమారుడిపై కిడ్నాప్, దాడి కేసు..

Awadesh Prasad

Awadesh Prasad

MP Awadhesh Prasad: అయోధ్య రామాలయం ఉన్న ఫైజాబాద్ ఎంపీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) తరుపున అవధేష్ ప్రసాద్ గెలిచి సంచలనం సృష్టించారు. అయోధ్య రామ మందిరం ప్రారంభమైన తర్వాత కొన్ని రోజులకే జరిగిన ఎన్నికల్లో బీజేపీ అక్కడ ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఒక్కసారిగా అవధేష్ ప్రసాద్ పేరు మార్మోగింది. ఇదిలా ఉంటే, తాజాగా ఆయన కుమారుడు అజిత్ ప్రసాద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి, బెదిరించి, దాడి చేశారన్న ఆరోపణలపై ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శనివారం ఇక్కడి కొత్వాలి సిటీ పోలీస్ స్టేషన్‌లో రవి తివారీ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదైంది

Read Also: Manish Sisodia: కొడుకు కాలేజీ ఫీజుల కోసం అడుక్కున్న: మనీష్ సిసోడియా

బీఎన్ఎస్ సెక్షన్లు 140 (3) (కిడ్నాప్), 115 (2) (స్వచ్ఛందంగా గాయపరచడం), 191 (3) (మారణాత్మకమైన ఆయుధాలతో అల్లర్లు చేయడం), 351 (3) ( నేరపూరిత బెదిరింపు) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భూమి కొనుగోలు కేసులో కమీషన్ వివాదం తర్వాత శనివారం మధ్యాహ్నం ఫైజాబాద్ నగరంలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ కూడలి సమీపంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. అజిత్ ప్రసాద్‌తో పాటు మరో ఐదుగురు వ్యక్తులు తివారీపై దాడి చేసి, కిడ్నాప్ చేశారని ఎఫ్ఐఆర్‌ పేర్కొంది.

ప్రాపర్టీ డీలింగ్స్‌లో కూడా అజిత్ ప్రసాద్ ప్రమేయం ఉంది. వచ్చే యూపీ ఉప ఎన్నికల్లో మిల్కిపూర్ స్థానం నుంచి అజిత్ ప్రసాద్ ఎస్పీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఎంపీగా అవధేష్ ప్రసాద్ గెలిచిన తర్వాత, మిల్కిపూర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఆ సీటుకు ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం అజిత్ ప్రసాద్‌పై ఫిర్యాదు చేసిన వ్యక్తి అయోధ్యలోని పురకలందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలియా రిసాలి గ్రామ వాసి. ఈ కేసులో సమగ్ర విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.