NTV Telugu Site icon

Karnataka Assembly: కర్ణాటక అసెంబ్లీలోకి కత్తితో మహిళ.. అరెస్టు చేసిన పోలీసులు

Karnataka Assembly

Karnataka Assembly

Karnataka Assembly: కర్ణాటక అసెంబ్లీలో వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. శాసనసభ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఇటీవల ఓ సామాన్య వ్యక్తి విధాన సౌధలోకి వచ్చి ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్న ఘటన తెలిసిందే. అది మరువకముందే సోమవారం మరో ఘటన జరిగింది. కర్ణాటక అసెంబ్లీలోకి ఓ మహిళ కత్తితో ప్రవేశించేందుకు ప్రయత్నించింది. విధాన సౌధ వద్ద పోలీసుల తనిఖీలు చేస్తుండగా ఈ విషయం బయటపడింది. దీంతో భద్రతా సిబ్బంది ఆమెను గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. విధాన సౌధ వద్ద ఇటీవల చోటుచేసుకున్న భద్రతా వైఫల్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఓ మహిళను తనిఖీ చేస్తుండగా ఆమె వద్ద కత్తి లభించడం కలకలం రేపింది. తూర్పు ద్వారం గుండా ఆ మహిళ లోపలికి వస్తుండగా.. అక్కడున్న సిబ్బంది ఆమెను తనిఖీ చేశారు. ఆమె బ్యాగ్‌ను స్కానింగ్‌ మెషిన్‌లోకి పంపగా అందులో ప్రమాదకర వస్తువులు ఉన్నట్లు సిగ్నల్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే బ్యాగ్‌ను తనిఖీ చేయగా.. కత్తి బయటపడింది.

Read also: Alla Nani: జగన్‌ని ఎదుర్కొనే ధైర్యం లేకనే.. పవన్ విషం చిమ్మారు

పోలీసులు మహిళ బ్యాగులో ఉన్న కత్తిని స్వాధీనం చేసుకుని సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెను పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఆమె ఎవరనే వివరాలు ఇంకా తెలియరాలేదు. ఆమె అసెంబ్లీ ప్రాంగణంలోనే ఉన్న ఓ విభాగంలో పనిచేసే సిబ్బంది అని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఘటన నేపథ్యంలో విధాన సౌధ స్పీకర్‌ అసెంబ్లీ పరిసరాలను పరిశీలిస్తున్నారు. గతవారం బడ్జెట్‌ సమావేశాల సమయంలో ఓ వ్యక్తి దర్జాగా సభలో ప్రవేశించి ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్న విషయం తెలిసిందే. జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యే కరియమ్మ కూర్చోవాల్సిన స్థానంలో గుర్తుతెలియని వ్యక్తి కూర్చున్నట్లు అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో మార్షల్స్‌ అతడిని బయటకు తీసుకెళ్లారు. సదరు వ్యక్తిని 70 ఏళ్ల తిప్పే రుద్రప్పగా గుర్తించారు. విజిటర్స్‌ పాస్‌ సంపాదించిన రుద్రప్ప.. తాను ఎమ్మెల్యేనని చెప్పి లోపలకు ప్రవేశించాడని పోలీసులు తెలిపారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే అనుకుని మార్షల్స్‌ సైతం అడ్డుచెప్పకపోవడంతో సభలోకి సులువుగా ప్రవేశించి ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్నాడని వివరించారు. రుద్రప్పపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.