PM Narendra Modi: ఈశాన్య రాష్ట్రాల్లో మరోసారి కమలం విరబూసింది. నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్షాలతో కలిసి అధికారం ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతోంది. గురువారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో కమలం పార్టీ భారీ విజయాన్ని దక్కించుకుంది. ఈ విజయంపై ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రజాస్వామ్యంపై పూర్తి విశ్వాసం ఉందని ఈ ఫలితాలు చూపిస్తున్నాయని అన్నారు. దేశంలోని ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజలకు ఉన్న దృఢ విశ్వాసానికి ఈ గెలుపే నిదర్శనం అని అన్నారు.
Read Also: Seediri Appalaraju: సలహాలు ఇచ్చేది పోయి విషం చిమ్ముతావా.. చంద్రబాబుపై మంత్రి ఫైర్
ఈశాన్య రాష్ట్రాలు ఢిల్లీ నుంచి మా దిల్ (హృదయం) నుంచి దూరం కాదని ఈ ఎన్నికలే చూపిస్తున్నాయని ఆయన అన్నారు. మూడు రాష్ట్రాల్లో విజయం కోసం కష్టపడిన కార్యకర్తలను, నేతలను ప్రధాని అభినందించారు. త్రిపుర, మేఘాలయ మరియు నాగాలాండ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నిలకు అంటే హింస కనిపించేదని, కానీ ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తోందని ప్రధాని అన్నారు. చాలా మంది పొలిటికల్ అనలిస్టులు బీజేపీ ఎలా విజయం సాధించిందని అనుకుంటారని..దానికి ‘త్రివేణి’ కారణం అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం పని, బీజేపీ పనిచేసే విధానం, బీజేపీ కార్యకర్తలే ఈ విజయానికి కారణం అని అన్నారు.
గురువారం వెలువడిని ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. త్రిపురలో బీజేపీ సునాయాస విజయం సాధించింది. ఇక నాగాలాండ్ రాష్ట్రంలో మిత్రపక్షం నేషనలిస్ట్ డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ( ఎన్డీపీపీ) పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక మేఘాలయలో పాత మిత్రపక్షం నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) మెజారిటీ స్థానాలు దక్కించుకున్నా, మ్యాజిక్ ఫిగర్ ను దాటలేదు. అయితే మరోసారి బీజేపీతో, ఎన్పీపీ చేతులు కలిపి అధికారంలోకి రానుంది.