PM Modi: అమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రీడ్‌మాన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్రమోడీ ఉక్రెయిన్-రష్యా యుద్ధం గురించి మాట్లాడారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని చర్చలు, దౌత్యమార్గాల్లో పరిష్కరించుకోవాలని మరోసారి పునరుద్ఘాటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి ‘‘ఇది యుద్ధానికి సమయం కాదు’’ అని చెబుతూనే, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీకి ‘‘యుద్ధభూమి విజయాలు శాశ్వత పరిష్కారానికి దారి తీయవు’’ అని సలహా ఇచ్చారు.
Read Also: PM Modi: భారత్ శాంతికి ప్రయత్నిస్తే.. పాకిస్తాన్ ప్రతీసారి ద్రోహం చేసింది..
కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం గురించి ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు. తనకు రష్యా, ఉక్రెయిన్ రెండు దేశాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ‘‘నేను అధ్యక్షుడు పుతిన్‌తో కూర్చుని ఇది యుద్ధానికి సమయం కాదని చెప్పగలను. అదే సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి స్నేహపూర్వక సలహా ఇవ్వగలను.. సోదరా, ప్రపంచంలో మీతో ఎంత మంది వ్యక్తులు నిలబడినా, యుద్ధభూమిలో ఎప్పటికీ పరిష్కారం ఉండదు’’ అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.
‘‘ఉక్రెయిన్ తన మిత్రదేశాలతో లెక్కలేనన్ని చర్చలు జరపొచ్చు, కానీ అవి ఫలించవు. ఇద్దరు చర్చల కోసం ముందుకు రావాలి’’ అని మోడీ అన్నారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని ముగించడానికి రష్యా, అమెరికా చర్చల్లో ఉన్నట్లు ఈ రోజు క్రెమ్లిన్ ధ్రువీకరించింది. సౌదీ అరేబియా జెడ్డా వేదికగా, అమెరికా ఉక్రెయిన్ అధికారులు చర్చిస్తున్నారు. ‘‘ప్రారంభంలో శాంతిని సాధించడం సవాల్‌గా ఉంది, కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఉక్రెయిన్, రష్యా మధ్య అర్థవంతమైన చర్చలకు అవకాశాన్ని అందిస్తుంది. చాలా బాధలు ఉన్నాయి. దీని వల్ల గ్లోబల్ సౌత్ కూడా బాధపడింది’’ అని ప్రధాని అన్నారు.