Site icon NTV Telugu

Farmers Killing: లఖింపూర్ ఖేరి ఘటన.. 4 నెలల తర్వాత మౌనం వీడిన మోడీ

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది… అయితే, తొలిసారి ఈ ఘటనపై స్పందించారు ప్రధాని నరేంద్ర మోడీ… లఖింపూర్ ఖేరీ ఘటన జరిగిన 4 నెలల తర్వాత మొదటి సారి రైతుల హత్యలపై వ్యాఖ్యానించారు.. ఈ కేసులో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా అక్టోబర్ నుండి జైలులో ఉండగా.. అజయ్‌ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినప్పటికీ అతడిని హోం శాఖ సహాయ మంత్రిగా కొనసాగిస్తోంది నరేంద్ర మోడీ సర్కార్.. అయితే, లఖింపూర్ ఖేరీ ఘటనపై మౌనం వీడిన ప్రధాని.. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు వాహనం నిరసన తెలిపిన రైతులపైకి దూసుకెళ్లాడన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని అన్నారు.

Read Also: KTR: మోడీ క్షమాపణ చెప్పాల్సిందే..!

ఉత్తరప్రదేశ్‌లో మొదటి దశ ఓటింగ్‌కు ఒక రోజు ముందు వార్తా సంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడిన ప్రధాని మోడీ.. చర్యలు, దర్యాప్తు నుండి బీజేపీ తన వాళ్లను రక్షించిందుకే ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణలపై స్పందించారు.. సుప్రీంకోర్టు ఏ కమిటీని కోరుకుందో దానికి రాష్ట్ర ప్రభుత్వం తన సమ్మతిని తెలిపిందని.. ఏ న్యాయమూర్తి విచారణకు సుప్రీంకోర్టు కోరుకుందో.. దానిపై రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందన్నారు ప్రధాని మోడీ.. కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ లఖింపూర్ ఖేరీ వద్ద అక్టోబర్ 3న రైతులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహిస్తుండగా.. రైతులపైకి దూసుకెళ్లింది ఓ కారు.. ఆ కారును ఆశిష్ మిశ్రా నడుపుతున్నాడు. రెండ్రోజుల తర్వాత అతడిని అరెస్టు చేశారు… అయితే, దర్యాప్తులో నెమ్మదిగా సాగుతున్నట్లు ఆరోపణలు రావడంతో, సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. రైతుల ఆగ్రహం, లఖింపూర్ ఖేరీ ఘటన ప్రభావం.. యూపీ ఎన్నికలలో బీజేపీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని విశ్లేషణలు ఉన్నాయి .. ముఖ్యంగా రైతులు గణనీయమైన ఓటింగ్ కలిగి ఉన్న పశ్చిమ ప్రాంతాలలో.. కొంత కోపాన్ని తగ్గించడానికి, ప్రభుత్వం నవంబర్‌లో వ్యవసాయ చట్టాలను ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుంది.. దీంతో ఢిల్లో సరిహద్దుల్లో సుదీర్ఘకాలం నిరసన తెలిపిన రైతులు కూడా తమ ఆందోళనను ముగించారు.. ఇక, రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను.. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఉపసంహరించుకున్నామని ప్రధాని మోడీ తెలిపారు.

Exit mobile version