PM Modi Xi to meet: భారత-చైనా సరిహద్దుల్లో వాస్తవనియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఇరు దేశాల సైన్యం ఉపసహరించుకున్నాయన్న ప్రకటన రావడం తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రష్యా కజాన్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సమావేశంలో రేపు ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మధ్య భేటీ జరగబోతోంది. మంగళవారం కజాన్లో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ విలేకరులతో మాట్లాడుతూ.. ఇరువురి నేతల మధ్య సమావేశం ఉంటుందని తెలిపారు. 2020లో గాల్వాన్ అంశం తర్వాత తొలిసారిగా ప్రధాని మోడీ, జిన్‌పింగ్‌తో సమావేశం అవుతున్నారు. ఐదేళ్ల తర్వాత ఇద్దరి మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరగబోతున్నాయి.
Read Also: PM Modi, Xi to meet: ప్రధాని మోడీ, జిన్ పింగ్ భేటీ.. 5 ఏళ్ల తర్వాత తొలి సమావేశం..
2020లో గాల్వాన్ వ్యాలీ ఘర్షణ తర్వాత నుంచి భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అప్పటి నుంచి ఇరువైపుల సైన్యం పెద్ద సంఖ్యలో మోహరించింది. ఇదిలా ఉంటే, బ్రిక్స్ సమావేశాలకు ముందు తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఘర్షణకు కారణమైన ప్రాంతాల నుంచి ఇదు దేశాలు తమ సైనికులను విత్ డ్రా చేసుకునే ఒప్పందం కుదిరింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించడానికి ఈ ఒప్పందం సహాయపడుతుంది. దెప్సాంగ్, డెమ్‌చోక్ ప్రాంతాల నుంచి సైన్యం ఉపసంహరణ సాగుతోంది. గతంలో అనేక సార్లు రెండు దేశాల సైన్యం మధ్య చర్చల అనంతరం పాంగాంగ్ త్సో, గోగ్రా, హాట్ స్ప్రింగ్ వంటి ప్రాంతాల నుంచి సైనిక ఉపసంహరణ జరిగింది. ఈ పరిణామాల అనంతరం ఇరు దేశాధినేతల మధ్య సమావేశం ఫిక్స్ అయింది.