PM Modi: పొదుపు, ఆర్థిక క్రమశిక్షణలపై ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం కేంద్ర మంత్రివర్గానికి కీలక సూచనలు చేశారు. భారతీయ సంస్కృతి పొదుపుపై ఆధారపడి ఉందని.. ‘‘తినడం, తాగడం, ఎంజాయ్ చేయడం’’ మన భారతీయ సంస్కృతి కాదని ప్రధాని అన్నారు. ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడంలో మనం సాధించిన పురోగతి, ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే మళ్లీ ప్రమాద స్థితికి చేరుతామని మంత్రుల్ని హెచ్చరించారు. ప్రజల పొదుపును ప్రోత్సహించడం ఎంతో ముఖ్యమని ప్రధాని నొక్కిచెప్పారు.
2011 నుంచి 2023 మధ్యకాలంలో దేశంలోని దాదాపు 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారని, ఇది దేశం సాధించిన పెద్ద విజయమని ఆయన అన్నారు. ఈ విజయాన్ని జాతీయ వేడుకగా జరుపుకోవాల్సిన సందర్భమని ప్రధాని మోడీ అభివర్ణించారు. అయితే, పేదరికం నుంచి బయటకు తీసుకురాకడం మాత్రమే సరిపోదని, మళ్లీ ప్రజలు పేదరికంలోకి వెళ్లకుండా నిరంతర ప్రయత్నాలు అవసరమని ఆయన హెచ్చరించారు.
న్యూఢిల్లీలో భారత్ మండపంలో జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం మూడున్నర గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశంలో డ్రగ్స్, అంతర్గత భద్రత వంటి కీలక అంశాలపై కూడా చర్చించారు. డ్రగ్స్ దుర్వినియోగం గురించి మాట్లాడిన సమయంలో మోడీ భావోద్వేగానికి గురయ్యారు. దేశ యువతను డ్రగ్స్ నుంచి కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

