NTV Telugu Site icon

PM Narendra Modi: కర్తవ్యపథ్‌గా మారిన రాజ్‌పథ్.. నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

Pm Narendra Modi Unveils Netaji Statue

Pm Narendra Modi Unveils Netaji Statue

PM Narendra Modi: దేశ రాజధానిలోని ఇండియా గేట్ సమీపంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం కొత్తగా నామకరణం చేసిన కర్తవ్యపథ్‌ను ప్రారంభించారు. ఢిల్లీ రాజ్ పథ్ మార్గాన్ని కర్తవ్య పథ్‌గా మారుస్తున్నట్లు కేంద్రమంత్రి మీనాక్షి లేఖి బుధవారం వెల్లడించారు. స్వాతంత్య్రానంతరం వలసవాద ఆలోచనా విధానాన్ని మార్చాలనే దిశగా ముందుకు వెళుతున్నామని చెప్పారు. ప్రజాసేవ అనేది పాలించే హక్కు కాదని సేవ చేసే హక్కని స్ఫురించేలా ఈ పేరును తీసుకున్నట్లు తెలిపారు. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ మీడియా సమావేశంలో బుధవారం ఆమె మాట్లాడారు. ఈ మేరకు పేరు మార్పుకు సంబంధించిన తీర్మానాన్ని ఎన్డీఎంసీ పాస్ చేసింది. స్వాతంత్య్రానంతరం వలసవాద ఆలోచనా విధానాన్ని మనం ముందుకు తీసుకెళ్లాం. ‘రాజు పాలన చేయాలనే ఆలోచనను రాజ్‌పథ్ తెలియజేస్తోంది.

నేతాజీ సేవలను తరతరాలకు చాటేందుకు ఇండియా గేట్‌ వద్ద నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహానికి ఖమ్మం జిల్లా గ్రానైట్‌ వినియోగించారు. ప్రఖ్యాత కళాకారుడు అరుణ్ యోగిరాజ్‌ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని రూపకల్పన చేశారు. దేశంలోనే ఎత్తయిన ఏకశిలా విగ్రహాల సరసన నేతాజీ విగ్రహం చేరింది. ఇండియా గేట్ వద్ద 28 అడుగుల ఎత్తుతో జెట్ బ్లాక్ గ్రానైట్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నేతాజీ 125వ జయంతిని పురస్కరించుకుని ఈ ఏడాది ప్రారంభంలో పరాక్రమ్ దివస్ (జనవరి 23) నాడు నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రదేశంలోనే ప్రధాని ఆవిష్కరించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

ఇంకోవైపు, దిల్లీలో కీలక ప్రాంతమైన రాజ్‌పథ్‌ను కర్తవ్యపథ్‌గా మారుస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మౌలిక సదుపాయాల పరంగా రాజ్‌పథ్‌లో అనేక మార్పులు చేశారు. ప్రజాసాధికారతకు చిహ్నంగా నిలిచే ఈ కర్తవ్యపథ్‌ను ప్రధాని ప్రారంభించారు. ఇండియా గేట్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌ వరకు ఉండే రాజ్‌పథ్‌ను వలసవాద విధానాలు, చిహ్నాల మార్పే లక్ష్యంగా కర్తవ్యపథ్‌గా నామకరణం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కర్తవ్య పథ్ మార్గంలో అందమైన ప్రకృతి దృశ్యాలు, నడక మార్గాలతో కూడిన పచ్చిక బయళ్ళు, పచ్చని ప్రదేశాలు, పునరుద్ధరించిన కాలువలు, కొత్త సౌకర్యాల బ్లాక్‌లు, వెండింగ్ కియోస్క్‌లు ప్రదర్శించబడతాయి. ఇంకా, కొత్త పాదచారుల అండర్‌పాస్‌లు, మెరుగైన పార్కింగ్ స్థలాలు, కొత్త ఎగ్జిబిషన్ ప్యానెల్‌లు, అప్‌గ్రేడ్ చేసిన నైట్ లైటింగ్ వంటి కొన్ని ఇతర ఫీచర్లు ప్రజల అనుభవాన్ని మెరుగుపరుస్తాయి.

Queen Elizabeth-2: బ్రిటీష్ క్వీన్ ఎలిజబెత్‌-2 ఆరోగ్యంపై వైద్యుల ఆందోళన

నూతన పార్లమెంట్‌, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో కూడిన సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో భాగంగా కర్తవ్యపథ్‌ను అభివృద్ధి చేశారు. 20 నెలలపాటు ఈ మార్గంలో ప్రజలను అనుమతించలేదు. శుక్రవారం నుంచి సందర్శనకు అనుమతించనున్నారు. సెంట్రల్‌ విస్టా అవెన్యూలో దారి పొడవునా ఆయా రాష్ట్రాలకు చెందిన ఆహార స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఎర్రటి గ్రానైట్‌ వాక్‌ వేలు, చుట్టూ హరితవనాలు, విక్రయశాలలు, పార్కింగ్‌ ప్రదేశాలతోపాటు 24 గంటలు కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఈ ఉద్యాన వనాల్లోకి ఆహార పదార్థాలను అనుమతించరు. దారి పొడవునా మొత్తం 16 వంతెనలు రెండుచోట్ల బోటింగ్‌ సదుపాయం కూడా ఉంటుంది. 1,125 వాహనాలు పార్కింగ్‌ చేసే సదుపాయం కల్పించారు. ఇండియాగేట్‌ వద్ద 35 బస్సులకు పార్కింగ్‌ వసతి ఉంటుంది. ఇండియా గేట్‌ చుట్టు పచ్చదనం ఉండేలా ప్రత్యేక ఉద్యానవనాలను అభివృద్ధి చేశారు. 1930లో ఆకాశం నుంచి చూస్తే ఎలా ఉండేదో ఆ స్థాయిలో పచ్చదనాన్ని పెంచారు. అక్కడి ప్రతిచెట్టు దాని ఎత్తు, రకం, పరిమాణాన్ని జియో ట్యాగింగ్‌ చేశారు.