Site icon NTV Telugu

PM Modi: రామేశ్వరంలో మోడీ శ్రీరామనవమి వేడుకలు.. అదే రోజు ‘‘పంబన్’’ వంతెన ప్రారంభం..

Pm Modi

Pm Modi

PM Modi: శ్రీరామనవమి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ తమిళనాడు రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఏప్రిల్ 06న ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇదే రోజు కొత్త ‘పంబన్ బ్రిడ్జ్’ని ప్రారంభిస్తారు. పంబన్ బ్రిడ్జ్ తమిళనాడు ప్రధాన భూభాగాన్ని రామేశ్వరం ద్వీపంతో అనుసంధానిస్తుంది. సముద్రంలో ఉన్న పాత వంతెన తుప్పు పట్టడంతో 2022లో మూసేశారు. 1914లో నిర్మించిన ఈ వంతెన స్థానంలో కొత్త వంతెన రానుంది.

Read Also: India On USCIRF: మైనారిటీలపై యూఎస్ నివేదిక.. భారత్ తీవ్ర ఆగ్రహం..

కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ నవంబర్ 2024లో ‘‘భారతదేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే వంతెన’’ అని దీని గురించి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కొత్త వంతెన 2.5 కి.మీ పొడవు ఉంది. దీనిని రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) రూ. 535 కోట్ల వ్యయంతో నిర్మించింది. ఇది హైస్పీడ్ రైళ్లు, పెరిగిన ట్రాఫిక్‌కి అనుగుణంగా నిర్మించారు.

హిందీ వివాదం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్‌ఈపీ)పై ఇటీవల కేంద్రం, తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హిందీని తమపై రుద్దేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తోందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు. దీని తర్వాత నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)ని వ్యతిరేకిస్తూ చెన్నైలో స్టాలిన్ నేతృత్వంలో భేటీ జరిగింది. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు తగ్గతాయని డీఎంకే ఆరోపిస్తోంది. ఈ వివాదాల నేపథ్యంలో ప్రధాని మోడీ తమిళనాడు పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Exit mobile version