NTV Telugu Site icon

PM Modi Ukraine visit: పోలాండ్, ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోడీ..

Pm Modi Ukraine Visit

Pm Modi Ukraine Visit

PM Modi Ukraine visit: ప్రధాని మోడీ పోలాండ్, ఉక్రెయిన్ పర్యటనలకు వెళ్లబోతున్నారు. ఆగస్టు 21న పోలాండ్ దేశంలో, ఆగస్టు 23న ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇటీవల రష్యాలో పర్యటించిన మోడీ, తాజాగా ఉక్రెయిన్ వెళ్లబోతున్నారు.

Read Also: Ashwini Vaishnaw: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. త్వరలోనే విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు

పోలాండ్ పీఎం డొనాల్డ్ టస్క్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ పంపిన ఆహ్వానాల మేరకు ప్రధాని మోడీ ఆయా దేశాల్లో పర్యటించనున్నారు. 30 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని తొలిసారిగా ఉక్రెయిన్ పర్యటనకు వెళ్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఇటీవల రష్యాకి వెళ్లిన ప్రధాని మోడీ ‘‘రష్యాని అన్ని కాలాల మిత్రుడు’’గా పేర్కొన్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చర్చలు, దౌత్య మార్గాల ద్వారా ఇరు దేశాలు సమస్యని పరిష్కరించుకోవాలని పదేపదే భారత్ చెబుతోంది. యుద్ధం ప్రస్తుత కాలంలో పరిష్కారం కాదని ప్రధాని మోడీ పలుమార్లు వ్యాఖ్యానించారు. అయితే, ఇటీవల ప్రధాని మోడీ రష్యా పర్యటనపై అమెరికాతో పాటు వెస్ట్రన్ దేశాలు గుర్రుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా, పాశ్చాత్య దేశాలతో భారత్ సంబంధాలను నార్మల్ చేయడానికి ప్రధాని ఉక్రెయిన్ పర్యటన సహకరిస్తుందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.

పోలాండ్‌లో 45 ఏళ్ల తర్వాత పర్యటించే తొలి భారత ప్రధానిగా నరేంద్రమోడీ రికార్డ్ స‌ృష్టించబోతున్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 70 ఏళ్లు పూర్తయ్యాయి. పోలాండ్ దేశంలో 25,000 మంది భారతీయులు ఉన్నారు. ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఆ దేశంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల్ని రక్షించడానికి పోలాండ్ సహకరించింది. ఇదే కాకుండా 1940లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 6000 మంది పోలాండ్ మహిళలు, పిల్లలకు భారతదేశంలోని జామ్‌నగర్, కోల్హాపూర్ రాజులు ఆశ్రయం ఇచ్చారు. ఇప్పటికీ ఈ విషయాన్ని ఆ దేశం గుర్తుంచుకుంది.