NTV Telugu Site icon

PM Modi: బీజేపీ ప్రభుత్వాల అభివృద్ధిని ఇతరుల పాలనతో పోల్చొద్దు

Pmmodi

Pmmodi

బీజేపీ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని ఇతర పార్టీల పాలనతో పోల్చవద్దని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ బుధవారం మధ్యప్రదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా కెన్-బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ఖజురహోలో జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిందని తెలిపారు. ఏడాదిలో జరిగిన అభివృద్ధి కొత్త రూపు సంతరించుకుందన్నారు. రూ.వేల కోట్ల విలువైన కార్యక్రమాలు మొదలయ్యాయని తెలిపారు. నేడు కెన్‌-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు శంకుస్థాపన జరిగిందని చెప్పారు. దేశాభివృద్ధిలో వాజ్‌పేయ్ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. సుశాసన్‌ దినోత్సవం ప్రభుత్వానికి ఒక్కరోజు కార్యక్రమం కాదని.. అది తమ గుర్తింపు అని పేర్కొన్నారు.

దేశ ప్రజలు హ్యాట్రిక్‌గా కేంద్రంలో ఎన్డీయే సర్కారును ఎన్నుకున్నారని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశంలోని మేధావులు కొన్ని ప్రమాణాలను తీసుకుని.. కాంగ్రెస్‌, లెఫ్ట్‌, కుటుంబ, సంకీర్ణ పార్టీల పాలనలో ఏం పనులు జరిగాయి..? బీజేపీ ఉన్న చోట్ల అభివృద్ధి ఎలా జరిగిందో విశ్లేషించాలని కోరారు. బీజేపీ ప్రజల కోసం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రభుత్వ ఫలాలు ప్రజలకు ఎంత వరకు చేరాయి అన్నదే ప్రామాణికం అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం అభివృద్ధి ప్రకటనల హడావుడికే పరిమితం అయిందని ధ్వజమెత్తారు.

కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 103 మెగావాట్ల జలవిద్యుత్, 27 మెగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2,000 గ్రామాలకు చెందిన దాదాపు 7.18 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. రైతులకు సాగునీరు పుష్కలంగా అందడంతో పాటు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు సరిపడా నీరు అందుతుంది. ఈ ప్రాంతం ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడంతో పాటు టూరిజం కూడా అభివృద్ధి చెంది కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. ప్రాజెక్ట్ కింద పన్నా టైగర్ రిజర్వ్‌లోని కెన్ నదిపై 77 మీటర్ల ఎత్తు మరియు 2.13 కిలోమీటర్ల పొడవు గల దౌధన్ ఆనకట్ట, రెండు సొరంగాలు నిర్మించనున్నారు.

 

Show comments