NTV Telugu Site icon

PM Modi: భూకంపాలపై మోడీ ఆరా.. బ్యాంకాక్‌, మయన్మార్‌కి అండగా ఉంటామని హామీ

Pmmodi

Pmmodi

భారీ భూప్రకంపనలతో బ్యాంకాక్, మయన్మార్ వణికిపోయాయి. రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో ప్రకంపనలు రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. భయంతో జనాలు బయటకు పరుగులు తీశారు. పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కూలిపోయాయి. అయితే ఈ ఘటనలో భారీగానే ప్రాణనష్టం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక థాయిలాండ్ ప్రధాని అత్యవసర పరిస్థితిని విధించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి సహా చర్యలు చేపట్టారు.

ఇదిలా ఉంటే శుక్రవారం చోటుచేసుకున్న భూప్రకంపనలపై ప్రధాని మోడీ ఆరా తీశారు. మయన్మార్, థాయిలాండ్ భూకంపాలపై ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మయన్మార్, థాయిలాండ్ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలని ప్రధాని మోడీ విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరారు. సాధ్యమైన అన్ని సహాయాలను అందించడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే భారత్‌లోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదైనట్లుగా తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా కోల్‌కతా, రాంచీ, త్రిపుర, అస్సాం, పాట్నాలో భూప్రకంపనలు సంభవించాయి. దీంతో భయంతో విద్యార్థులు, అధ్యాపకులు క్లాస్ రూమ్‌లోంచి బయటకు వచ్చేశారు. అలాగే అధికారులు కూడా కార్యాలయాల్లోంచి ఇళ్లకు వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.