పశ్చిమాసియా సంక్షోభం వేళ దేశంలో ఇంధన సంక్షోభాన్ని విజయవంతం ఎదుర్కొన్నట్లు ప్రధాని మోడీ అన్నారు. శనివారం రాజస్థాన్‌లోని బాలోత్రా జిల్లా పచ్‌పద్రాలో దేశంలోని తొలి గ్రీన్‌ఫీల్డ్ సమగ్ర రిఫైనరీ-పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను మోడీ ప్రారంభించారు. సుమారు రూ.1.06 లక్షల కోట్ల విలువైన పెట్రోకెమికల్స్, రైల్వేలు, రహదారులు, మెట్రో, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ ప్రసార ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. దేశ ఇంధన భద్రత, పశ్చిమాసియా యుద్ధం సమయంలో భారత్ ఎదుర్కొన్న సవాళ్లు, వాటిని అధిగమించిన విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని ప్రధాని తెలిపారు. ఈ సమయంలో భారత్‌లో ఇంధన కొరత వస్తుందని కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ప్రతిపక్షాలను ఉద్దేశించి ఆరోపించారు. ‘‘ప్రజలను భయపెట్టే ప్రయత్నాలు జరిగాయి. రాజకీయాలు చేశారు. కానీ వారి కుట్రలు ఫలించలేదు. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు తప్ప దేశంలో ఎక్కడా ఇంధన సరఫరా ఆగలేదు.’’ అని అన్నారు. ఏప్రిల్ నుంచి జూన్ మధ్యకాలంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలు రూ.75 వేల కోట్లకు పైగా నష్టాన్ని భరించాయని తెలిపారు. ప్రజలపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం లీటరుకు రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని కూడా తగ్గించిందని పేర్కొన్నారు. భారత్‌కు పెద్దగా చమురు నిల్వలు లేవని గుర్తుచేసిన ప్రధాని.. యుద్ధం సమయంలో ముడి చమురు ధర బ్యారెల్‌కు 70 డాలర్ల నుంచి 120 డాలర్లకు పెరిగిందన్నారు. కొన్ని దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు 40-50 శాతం పెరగడమే కాకుండా రేషన్ విధానం కూడా అమలు చేశారని చెప్పారు. అయితే భారత్‌లో మాత్రం ఒక్కరోజు కూడా ఇంధన కొరత తలెత్తలేదని స్పష్టం చేశారు.
సంక్షోభానికి ముందు భారత్ కేవలం 25-26 దేశాల నుంచే ఇంధనం దిగుమతి చేసుకునేదని.. కానీ యుద్ధం ప్రారంభమైన తర్వాత భారత దౌత్యపరమైన ప్రయత్నాల వల్ల 40కిపైగా దేశాల నుంచి చమురు, ఇంధనం దిగుమతి చేసుకున్నామని ప్రధాని వెల్లడించారు. దేశ ప్రయోజనాలు, ప్రజల సంక్షేమమే భారత్‌కు అత్యంత ప్రాధాన్యం అనే సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చామని అన్నారు. భారత్‌కు అవసరమైన ఎల్పీజీలో దాదాపు 60 శాతం దిగుమతుల ద్వారానే వచ్చేదని.. అందులో 90 శాతం హార్ముజ్ జలసంధి మార్గంలో గల్ఫ్ దేశాల నుంచే వచ్చేదని తెలిపారు. యుద్ధం కారణంగా సరఫరా దాదాపు నిలిచిపోయిన సమయంలో రిఫైనరీల సామర్థ్యాన్ని వినియోగించి కేవలం ఏడు రోజుల్లోనే దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని 35 వేల మెట్రిక్ టన్నుల నుంచి 54 వేల మెట్రిక్ టన్నులకు పెంచామని చెప్పారు. ఇప్పటివరకు ఎల్పీజీ ఉత్పత్తి చేయని కొన్ని రిఫైనరీలను కూడా ఈ అవసరానికి అనుగుణంగా మార్చినట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా పైప్ ద్వారా సహజ వాయువు (PNG) కనెక్షన్లను వేగంగా విస్తరించామని, 11 లక్షలకుపైగా కుటుంబాలకు కొత్త పీఎన్‌జీ కనెక్షన్లు అందించామని ప్రధాని వెల్లడించారు.మార్కెట్ అంచనాల ప్రకారం గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.2,000 వరకు చేరే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రస్తుతం రూ.950లోపే అందిస్తున్నామని పేర్కొన్నారు. పశ్చిమాసియా యుద్ధం 21వ శతాబ్దంలోనే అతిపెద్ద ఇంధన సంక్షోభానికి కారణమైందన్నారు. ‘‘సమస్యను ముందుగానే అంచనా వేసి సరైన నిర్ణయాలు తీసుకున్నాం. దేశ వనరులను సమర్థంగా వినియోగించాం. దౌత్య శక్తిని సానుకూలంగా ఉపయోగించాం. అందుకే భారత్ ఈ సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది.’’ అని చెప్పారు.
ఇర పచ్‌పద్రా రిఫైనరీతో భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రిఫైనింగ్ దేశంగా మరింత బలోపేతమవుతోందని ప్రధాని తెలిపారు. ఈ సమగ్ర రిఫైనరీకి ఏడాదికి 2.4 మిలియన్ మెట్రిక్ టన్నుల పెట్రోకెమికల్ ఉత్పత్తి సామర్థ్యం ఉందన్నారు. ఇది దేశ ఇంధన భద్రతను పెంచడంతో పాటు పెట్రోకెమికల్ రంగంలో స్వయం సమృద్ధికి దోహదపడుతుందని.. వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అదనంగా జైపూర్ మెట్రో రెండో దశ, రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, బికానేర్ సోలార్ పార్కులు, విద్యుత్ ప్రసార లైన్లు సహా పలు అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ప్రధాని దేశానికి అంకితం చేశారు.

