ప్రధాని మోడీ కేంద్ర సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ ఉన్నతస్థాయి సమావేశంలో రక్షణ, విదేశాంగ, ఆర్థిక, వాణిజ్య, ఆరోగ్య శాఖలకు చెందిన కీలక మంత్రులతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేబినెట్ కార్యదర్శి పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో చర్చిస్తున్న అంశాలు, అధికారిక అజెండా ఏమిటన్నది మాత్రం వెల్లడికాలేదు. దీంతో ఈ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ హాజరయ్యారు. అలాగే ఆరోగ్యం, రసాయనాలు-ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. అలాగే కేబినెట్ కార్యదర్శితో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా సమావేశంలో ఉన్నారు. దేశ భద్రత, అంతర్జాతీయ పరిణామాలు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అంశాలు లేదా ఇతర కీలక విధాన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే సమావేశానికి సంబంధించిన అధికారిక అజెండాను ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించలేదు.
మధ్యప్రాచ్యంలో తాజాగా ఉద్రిక్తతలు మళ్లీ పెరిగిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇరాన్‌పై అమెరికా కొత్తగా దాడులు చేయడం, హార్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రం మీదుగా జరిగే అంతర్జాతీయ నౌకా రవాణాకు కొనసాగుతున్న ముప్పు వంటి పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధిలో నౌకా రవాణాకు ఎదురవుతున్న ముప్పు వంటి అంశాలు గురువారం జరిగిన సమావేశంలో చర్చకు వచ్చాయా లేదా అన్నది స్పష్టంగా తెలియలేదు. సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

