PM Modi: ప్రధాని మోడీ గొప్ప మనసు.. వృద్ధురాలికి స్వయంగా సాయం

Pm Modi

Pm Modi

PM Modi’s Kind Gesture in Mysuru: ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి వార్తల్లో నిలిచారు. కర్ణాటకలోని మైసూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అస్వస్థతకు గురైన 70 ఏళ్ల వృద్ధురాలికి స్వయంగా సహాయం అందించారు. ఆమె పరిస్థితిని గమనించిన ప్రధాని వెంటనే స్పందించి, అవసరమైన వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శుక్రవారం మైసూరులోని కాస్మోస్ ప్లానిటోరియం (COSMOS Planetarium) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు.

ఈ సందర్భంగా నంజన్‌గూడ్ టౌన్ మున్సిపాలిటీ మాజీ అధ్యక్షురాలు, బీజేపీ కార్యకర్త ప్రేమా సింబయ్య (Prema Simbaiya) అస్వస్థతకు గురయ్యారు. ఆమెకు ఒక్కసారిగా కళ్లు తిరగడంతో కింద పడిపోయే పరిస్థితి ఏర్పడింది. దీన్ని గమనించిన ప్రధాని మోడీ వెంటనే ఆమె వద్దకు వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమె కోలుకునేందుకు జ్యూస్ అందించేలా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా తన కాన్వాయ్‌లో భాగంగా ఉన్న వైద్యుడిని పిలిపించి, వృద్ధురాలికి తక్షణ వైద్య సహాయం అందేలా చూశారు.

ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను బీజేపీ మహిళా మోర్చా తన అధికారిక X ఖాతాలో షేర్ చేసింది. 70 ఏళ్ల ప్రేమా కే. అస్వస్థతకు గురైన సమయంలో ప్రధాని మోడీ స్వయంగా ఆమె వద్దకు వెళ్లి యోగక్షేమాలు తెలుసుకున్నారని పేర్కొంది. వైద్యులు వెంటనే అవసరమైన చికిత్స, ఎలక్ట్రోలైట్స్ అందించేలా ప్రధాని చర్యలు తీసుకున్నారని తెలిపింది. అవసరమైన సమయంలో బాధితులకు అండగా నిలబడటమే నిజమైన నాయకత్వ లక్షణమని ఆ పోస్టులో కొనియాడింది.