PM Modi: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తన మణిపూర్ పర్యటన నుంచి నేపాల్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సుశీల కార్కీకి అభినందనలు తెలియజేశారు. ఇంఫాల్‌లోని చారిత్రాత్మక కాంగ్లా కోట నుంచి మాట్లాడుతూ.. ‘‘హిమాలయ ఒడిలో ఉన్న నేపాల్ మా సన్నిహిత మిత్రుడు. మేము చరిత్ర, విశ్వాసం ఆధారంగా కలిసి ఉన్నాము. మేము కలిసి పురోగమిస్తున్నాము. 1.4 బిలియన్ల భారతీయుల తరుఫున నేపాల్ మొదటి మహిళ ప్రధాని అయిన సుశీల కార్కిని నేను అభినందిస్తున్నాను. ఆమె నేపాల్‌లో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుకు మార్గం సుగమం చేస్తారనే నమ్మకం నాకు ఉంది’’ అని అన్నారు.
నేపాల్ దేశ తొలి మహిళ ప్రధాని అయిన కార్కిని ‘‘మహిళా సాధికారత’’కు ఉదాహరణగా అభివర్ణించారు. నేపాల్‌లో ఇటువంటి అల్లకల్లోల పరిస్థితుల్లో ‘‘ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టిన ప్రతి వ్యక్తిని తాను అభినందిస్తున్నాను’’ అని ఆయన అన్నారు. ‘‘నేపాల్‌లో ఇటీవల జరిగిన సంఘటనల్లో గుర్తించబడని విషయం ఏంటంటే, గత కొన్ని రోజులుగా నేపాల్ యువత వీధులను శుభ్రం చేస్తున్నట్లు కనిపించారు. దీనిని సోషల్ మీడియాలో నేను చూశానున. ఇది నేపాల్ పునరుజ్జీవనానికి సంకేతం. నేపాల్ ఉజ్వల భవిష్యత్తుకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’’ అని ఆ దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు.
దీనికి ముందు, ప్రధాని మోడీ ఎక్స్ ద్వారా సుశీల కార్కికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ నేపాల్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన గౌరవనీయులైన శ్రీమతి సుశీల కార్కికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నేపాల్ ప్రజలు శాంతి, పురోగతి, శ్రేయస్సుకు భారతదేశం దృఢంగా కట్టుబడి ఉంది’’ అని అన్నారు.
