స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ విద్యార్థులనుద్దేశించి కీలక ప్రకటన చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉచితంగా ఆన్‌లైన్ కోచింగ్ అందిస్తామని ప్రకటించారు. తాజాగా మోడీ ప్రకటనపై అనూహ్య స్పందన వస్తోంది.
ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ కార్యక్రమానికి ఫిజిక్స్ వాలా వ్యవస్థాపకుడు అలఖ్ పాండే మద్దతు తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉచితంగా ఆన్‌లైన్ కోచింగ్ అందించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతించారు.. ఈ కార్యక్రమం అమలుకు ప్రభుత్వం చేపట్టే చర్యలకు ‘‘షరతులు లేని మద్దతు’’ అందిస్తామని ప్రకటించారు.
ఎర్రకోట నుంచి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రధాని మోడీ ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ కార్యక్రమాన్ని ప్రకటించిన కొద్దిసేపటికే అలఖ్ పాండే స్పందించారు. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అందించనున్నట్లు ప్రధాని వెల్లడించారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులపై కోచింగ్ ఖర్చుల భారాన్ని తగ్గించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.
అలఖ్ పాండే ఏమన్నారంటే?
ప్రధాని మోడీ ప్రకటనను అలఖ్ పాండే స్వాగతించారు. నాణ్యమైన విద్యను దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు అందించేందుకు ఆన్‌లైన్ విద్య ఎంతో ఉపయోగపడుతుందని తాను చాలాకాలంగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ‘‘అవసరమైన విద్యార్థులందరికీ ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అందిస్తామన్న గౌరవనీయ ప్రధాని హామీని నేను నిజంగా అభినందిస్తున్నాను’’ అని అలఖ్ పాండే సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అయితే కేవలం ప్రకటన చేయడం మాత్రమే కాకుండా.. ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయడమే అసలు సవాలు అన్నారు. ప్రభుత్వం చేపట్టే ఈ కార్యక్రమానికి తాను మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, ఇందుకు ప్రతిఫలంగా ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు ఆశించడం లేదని అలఖ్ పాండే స్పష్టం చేశారు. ‘‘నాకు ప్రతిఫలంగా ఎలాంటి లాభాలు అవసరం లేదు. భారతదేశంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య ఉచితంగా అందాలి’’ అని పేర్కొన్నారు.
కోటి మంది యువతకు ఏఐ శిక్షణ
పోటీ పరీక్షలకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్‌తో పాటు యువత కోసం దేశవ్యాప్తంగా కృత్రిమ మేధ (AI) నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని కూడా ప్రధాని మోడీ ప్రకటించారు. వచ్చే ఏడాది కాలంలో కోటి మంది యువతకు ఏఐ శిక్షణ అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఉచిత పోటీ పరీక్షల కోచింగ్, భారీ స్థాయిలో ఏఐ శిక్షణ కార్యక్రమాలు.. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను డిజిటల్ వేదికల ద్వారా మరింత విస్తరించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగంగా చూడవచ్చు.
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు అందుబాటులో ఉండే ధరల్లో ఆన్‌లైన్ విద్యను అందించడంలో ఫిజిక్స్ వాలా ఇప్పటికే కీలకంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రకటించిన ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ కార్యక్రమం.. నాణ్యమైన విద్యను సాంకేతికత ద్వారా మరింత మంది విద్యార్థులకు చేరువ చేయాలన్న అలఖ్ పాండే ఆలోచనలకు దగ్గరగా ఉందని చెప్పవచ్చు.

