NTV Telugu Site icon

PM Narendra Modi: “మజెల్ తోవ్ మై ఫ్రెండ్”.. బెంజమిన్ నెతన్యాహూకు నరేంద్ర మోదీ శుభాకాంక్షలు

Pm Narendra Modi

Pm Narendra Modi

PM Modi Congratulates Israel’s Netanyahu: ఇజ్రాయిల్ సార్వత్రిక ఎన్నికల్లో బెంజమిన్ నెతన్యాహు ఘన విజయం సాధించారు.  ఎగ్జిట్ పోల్ అంచనాలను నిజం చేస్తూ ఇజ్రాయిల్ పార్లమెంట్ లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నారు. నెతన్యాహూ నేతృత్వంలోని లికుడ్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి యాయిర్ లాపిడ్ తన పరాజయాన్ని అంగీకరించారు. గురువారం జరిగిన ఓట్ల లెక్కింపు తర్వాత నెతన్యాహుకు అభినందనలు తెలిపారు.  99 శాతం ఓట్ల లెక్కింపు తర్వాత నెతన్యాహు పార్టీ 120 సీట్లకు గానూ 64 సీట్లను కైవసం చేసుకుంది.

Read Also: Woman Mystery Case: వీడిన వివాహిత హత్య కేసు మిస్టరీ.. అతడే కాలయముడు

ఇజ్రాయిల్ ఎన్నికల్లో ఘన విజయం సాాధించిన నెతన్యాహును అభినందిస్తూ ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. హిబ్రూ భాషలో ‘‘ మాజెల్ తోవ్ మై ఫ్రెండ్’’ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. రైటిస్ట్ పార్టీ అయిన లికుడ్ పార్టీ దాని మిత్ర పక్షాలు తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. ప్రధాని మోదీ నెతన్యాహుకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు భారత్-ఇజ్రాయిల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకు ఇరు దేశాలు ప్రయత్నాలు కొనసాగించడానికి నేను ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేశారు.  భారతదేశం-ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇచ్చినందుకు యైర్ లాపిడ్‌కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

గత కొన్నేళ్లుగా దేశంలో ఏర్పడిన రాజకీయ అస్థిరతకు నెతన్యాహు చెక్ పెట్టారు. 2019లో అవినీతి ఆరోపణలు, లంచం, విశ్వాస ఉల్లంఘన వల్ల పదవి నుంచి దిగిపోయిన తర్వాత లెఫ్ట్ భావజాలం కలిగిన యాయిర్ లాపిడ్, నఫ్తాలీ బెన్నెట్, అరబ్ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి.  అయినా కూడా కూటమిలో లుకలుకలు దేశ రాజకీయాల్లో అస్థిరతను పెంచాయి. దీంతో ఈసారి ప్రజలు మరోసారి నెతన్యాహు వైపే మొగ్గు చూపారు. ఇజ్రాయిల్ కు ఎక్కువ కాలం పనిచేసిన రికార్డు నెతన్యాహు పేరున ఉంది. ఇక మరోసారి ఇజ్రాయిల్ ప్రధాని పీఠాన్ని నెతన్యాహు అధిష్టించనున్నారు.