PM Modi: జమ్మూ కాశ్మీర్‌లో గత నెల రోజుల నుంచి వరసగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం జరిగిన దోడా ఎన్‌కౌంటర్‌లో నలుగురు జవాన్లు మరణించారు. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతున్న వరస ఉగ్రదాడులపై ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన అత్యున్నత భద్రతా సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Read Also: MLC Jeevan Reddy: నీ రాజీనామా పత్రం ఎక్కడ..? హరీష్ రావు కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్న..
ఇటీవల దోడాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు జవాన్లు మరణించారు. ఈ రోజు జరుగుతున్న మీటింగ్‌కి ముందు మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. దోడా ప్రాంతంలో ఉగ్రవాదుల్ని ఏరివేయడానికి భద్రతా బలగాలు భారీ ఎత్తున ఆపరేషన్ చేపట్టాయి.
ఇదిలా ఉంటే, ప్రధాని నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేపట్టి రోజు ఉగ్రవాదులు రియాసి జిల్లాలో భారీ దాడికి పాల్పడ్డారు. శివ్ ఖోరా నుంచి కత్రా వెళ్తున్న యాత్రికుల బస్సుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది మరణించారు. ఆ తర్వాత కథువా, దోడా ప్రాంతాల్లో వరసగా ఉగ్రఘటనలు చోటు చేసుకున్నాయి. కాశ్మీర్ లోయ ప్రాంతం ప్రస్తుతం ప్రశాంతంగా ఉండగా, గత కొన్నేళ్లుగా ఉగ్రవాదం లేని జమ్మూ ప్రాంతంలో వరసగా ఉగ్రదాడులు జరుగుతుండటం కలవరపరుస్తోంది.