Cabinet Reshuffle: కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ సోమవారం మంత్రులతో కీలక భేటీ నిర్వహించబోతున్నారు. మంత్రుల పనితీరుపై చర్చించే అవకాశం ఉంది. మంత్రిత్వ శాఖల పనితీరు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, మంత్రులకు అప్పగించిన బాధ్యతల్లో పురోగతిపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమీక్షల తర్వాత కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సోమవారం జరిగే తొలి దశ సమావేశంలో విద్య, సామాజిక న్యాయం-సాధికాతర, వ్యవసాయం వంటి శాఖలకు సంబంధించిన మంత్రులు పాల్గొననున్నట్లు సమాచారం. ఆయా శాఖల పురోగతి, చేపట్టిన కార్యక్రమాల అమలు, పనితీరుకు సంబంధించిన నివేదికలను మంత్రులు ప్రధానికి సమర్పించనున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఒక్క సమావేశంతోనే మంత్రుల సమావేశాలు ముగిసే అవకాశం లేదు. రాబోయే రోజుల్లో ఇతర మంత్రిత్వ శాఖలకు చెందిన మంత్రులతో ఇలాంటి సమావేశాలు పలు దశల్లో జరిగే అవకాశం ఉంది.
సోమవారం జరిగే భేటీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై మరిన్ని ఊహాగానాలను పెంచుతోంది. పునర్వ్యవస్థీకరణకు ముందు జరిగే ప్రక్రియగా దీనిని రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు కేంద్రం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఎలాంటి అధికారిక వ్యాఖ్యలు, ప్రకటన చేయలేదు.

