PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని

  • భజన క్లబ్బింగ్‌లో పాల్గొన్న మోడీ
  • యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
Modi

Modi

ఢిల్లీలో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోడీ యువతతో కలిసి ‘భజన్ క్లబ్బింగ్’లో పాల్గొన్నారు. సంప్రదాయ భక్తి గీతాలను ఆధునిక సంగీత కచేరీల తరహాలో ఆలపిస్తూ, చప్పట్లు కొడుతూ, కంజర వాయిస్తూ ఉత్సాహపరిచారు. ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ పార్క్‌లో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువతతో కలిసి భక్తి గీతాలను ఆస్వాదించారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 110వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కార్యక్రమంలో ముందు వరుసలో కూర్చున్న ప్రధాని మోడీ.. భజనలకు అనుగుణంగా చప్పట్లు కొట్టారు. ఒక భజన సమయంలో కంజర వాయిద్యాన్ని కూడా వాయిస్తూ కనిపించారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది యువతే ఉండటం విశేషం. భజనలతో పాటు యువత చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఇంతకీ ‘భజన్ క్లబ్బింగ్’ అంటే?

సాంప్రదాయ భక్తి గీతాలను ఆధునిక సంగీతం, కచేరీ తరహా వాతావరణంతో కలిపి నిర్వహించే కార్యక్రమాలను ‘భజన్ క్లబ్బింగ్’గా పిలుస్తున్నారు. సాధారణ భజన కార్యక్రమాలకు భిన్నంగా.. లైవ్ బ్యాండ్‌లు, ఆధునిక వాయిద్యాలు, హై-ఎనర్జీ మ్యూజిక్‌తో యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాల్లో యువత భజనలతో పాటు పాడుతూ, చప్పట్లు కొడుతూ, నృత్యం చేస్తుంటారు. అయితే సాధారణ క్లబ్బింగ్‌కు భిన్నంగా.. ఇక్కడ ప్రధానంగా ఆధ్యాత్మిక, భక్తి గీతాలే ఉంటాయి. ఈ ట్రెండ్‌కు ముఖ్యంగా Gen Z యువతలో ఆదరణ పెరుగుతోంది.

గతంలోనూ మోడీ ప్రస్తావన

‘భజన్ క్లబ్బింగ్’ గురించి ప్రధాని మోడీ గతంలో కూడా ప్రస్తావించారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో యువత సంప్రదాయ భక్తి సంగీతాన్ని ఆధునిక శైలితో మేళవిస్తూ కొత్త పద్ధతుల్లో ఆధ్యాత్మికతకు చేరువవుతున్న తీరు ఆసక్తికరంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన కార్యక్రమంలోనూ ఈ ట్రెండ్‌ను ప్రస్తావించారు.

దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ..

భజన్ క్లబ్బింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం ఢిల్లీ సహా పలు నగరాల్లో నిర్వహిస్తున్నారు. 2026లో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన పలు కాలేజీల్లో కూడా భజన్ క్లబ్బింగ్ కార్యక్రమాల సిరీస్ నిర్వహించారు. సంప్రదాయ భక్తి సంగీతాన్ని యువతకు చేరువ చేసేలా ఆధునిక సంగీత శైలులను ఉపయోగించడం ఈ కార్యక్రమాల ప్రత్యేకతగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో నిర్వహించిన భజన్ క్లబ్బింగ్ కార్యక్రమంలో ప్రధాని మోడీ యువతతో కలిసి పాల్గొనడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.