PM Modi: ఆస్ట్రేలియా టూర్‌ ముందు మోడీకి బెదిరింపులు.. ఫేస్‌బుక్ ఐడీ ఎక్కడదంటే..!

  • ఆస్ట్రేలియా టూర్‌ ముందు మోడీకి బెదిరింపులు
  • ఫేస్‌బుక్ ఐడీని గుర్తించిన పోలీసులు
  • భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు
Modi1

Modi1

ప్రధాని మోడీ ఆస్ట్రేలియా పర్యటనకు ముందు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మోడీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో హత్య బెదిరింపు రావడంతో ఆస్ట్రేలియా అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. బెదిరింపు సందేశం పోస్టు చేసిన వ్యక్తికి సంబంధించిన ఐపీ అడ్రస్‌ను గుర్తించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రధాని మోడీ జూలై 8 నుంచి 10 వరకు మెల్‌బోర్న్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.

ఫేస్‌బుక్‌లో బెదిరింపు సందేశం

స్థానిక మీడియా కథనం ప్రకారం.. జూలై 9న మెల్‌బోర్న్‌లోని మార్వెల్ స్టేడియంలో జరగనున్న ‘‘Melbourne Meets Modi’’ కార్యక్రమానికి సంబంధించిన ఫేస్‌బుక్ పోస్టు కింద ‘‘అబు ముస్తఫా’’ (Abu Mustafa) పేరుతో ఉన్న ఖాతా నుంచి బెదిరింపు వ్యాఖ్య పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలో ‘‘కార్యక్రమం జరిగే సమయంలో స్టేడియం పైకప్పు మూసి ఉంచడం మంచిది. లేకపోతే ఆయన ఆస్ట్రేలియాకు తన మరణం కోసం వస్తారు.’’ అంటూ హెచ్చరిక చేశారు. ఈ బెదిరింపు పోస్టుకు సంబంధించిన ఐపీ అడ్రస్‌ను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఇది క్రిమినల్ నేరం కిందకు వస్తుందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేసినట్లు ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ అధికారికంగా ప్రకటించలేదు. దర్యాప్తు కొనసాగుతున్నందున మరిన్ని వివరాలను వెల్లడించలేమని పేర్కొంది.

భద్రతపై ప్రత్యేక దృష్టి

ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆస్ట్రేలియాలోని పలు భద్రతా సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఈ బెదిరింపును అత్యంత తీవ్రంగా పరిగణిస్తూ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలుస్తోంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ పర్యటనలో ప్రధాని మోడీ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. అలాగే ఆస్ట్రేలియా గవర్నర్ జనరల్‌ను కూడా మర్యాదపూర్వకంగా కలవనున్నారు. అంతేకాకుండా ఇండియా-ఆస్ట్రేలియా సీఈఓల ఫోరం సమావేశంలో పాల్గొని ఇరు దేశాల ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అలాగే భారీ సంఖ్యలో హాజరుకానున్న భారతీయ ప్రవాసులను కూడా ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.