NTV Telugu Site icon

PM Modi: వచ్చే వారం భూటాన్ పర్యటనకు ప్రధాని నరేంద్రమోడీ..

Pm Modi

Pm Modi

PM Modi: వచ్చే వారం ప్రధాని నరేంద్రమోడీ భూటాన్ దేశ పర్యటకు వెళ్లనున్నారు. తమ దేశంలో పర్యటించాల్సిందిగా భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్ చేసిన ఆహ్వానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. గురువారం న్యూఢిల్లీలో భూటాన్ ప్రధాని షేరింగ్ టోబ్‌గేతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఇరు దేశాల సంబంధాలు, భాగస్వామ్యంపై ఇరువురు మాట్లాడుకున్నారు. ఆ సమయంలో రాజు వాంగ్‌చుక్ తరపున అధికారిక ఆహ్వానాన్ని భూటాన్ ప్రధాని టోబ్‌గే, ప్రధాని మోడీకి అందించారు. దీనికి మోడీ ఓకే చెప్పారు. అయితే, పర్యటన అధికారిక తేదీలను విదేశాంగ శాఖ తర్వలో విడుదల చేసే అవకాశం ఉంది.

Read Also: Congress: కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గింపు రాహుల్ గాంధీ ఘనతే..

ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, కనెక్టివిటీ, ఇంధనం, జలవిద్యుత్ సహకారం, ప్రజలతో ప్రజల మార్పిడి మరియు అభివృద్ధి సహకారంతో సహా వివిధ రంగాలలో పురోగతిని సమీక్షించారు. భారత్, భూటాన్ మధ్య ఉన్న ప్రత్యేకమైన స్నేహాన్ని బలపేతం చేయడానికి తమ నిబద్ధతను ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. భూటాన్ అభివృద్ధిలో నమ్మకమైన మిత్రుడైన భారత్ పాత్రను ఆ దేశ ప్రధాని ప్రశంసించారు.

భారత్,చైనా సరిహద్దుల్లో ఉన్న భూటాన్ దేశం వ్యూహాత్మకంగా భారత్‌కి ఎంతో కీలకం. గతంలో డోక్లాం పీఠభూమి వద్ద చైనా ఆర్మీని అడ్డుకుని భూటాన్ సార్వభౌమాధికారాన్ని భారత్ కాపాడింది. అయితే, ఇటీవల కాలంలో చైనా ఆ దేశానికి దగ్గరవుతోంది. దీంతో పాటు చైనా, భూటాన్ తమ సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవాలని అనుకుంటున్నాయి. అయితే, ఈ విషయంలో భారత్‌పై వ్యూహాత్మకంగా పైచేయి సాధించేందుకు భూటాన్‌ని చైనా వాడుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ భూటాన్ పర్యటన పరిస్థితిని మార్చే అవకాశం ఉంది.