Site icon NTV Telugu

PM Modi: బెంగాలీయులకు 6 హామీలు ప్రకటించిన మోడీ.. ఏంటంటే..!

Modi521

Modi521

ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఇద్దరూ కలిసి పనిచేస్తేనే రాష్ట్ర ప్రజలు అత్యధికంగా ప్రయోజనం పొందుతారని ప్రధాని మోడీ అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ఎన్నికల ప్రచారంలో భాగంగా పూర్బా మేదినీపూర్ బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు.

ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ వాసులకు ఆరు హామీలు ప్రకటించారు.

1. మొదటి హామీ: బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో ఉన్న భయానక వాతావరణాన్ని తొలగించి.. న్యాయ పరిపాలనపై ప్రజల్లో తిరిగి నమ్మకాన్ని కలిగిస్తాం.

2. రెండవ హామీ: బీజేపీ పాలనలో పరిపాలనా వ్యవస్థ పూర్తిగా ప్రజలకు బాధ్యత వహించేలా జవాబుదారీగా మారుతుంది. పూర్తిగా బాధ్యత వహించేలా ఉంటుంది.

3. మూడవ హామీ: అవినీతి, అక్రమాలు, మహిళలపై జరిగిన అన్యాయాలు, అత్యాచారాల కేసులు సహా అన్ని ఫైళ్లను మళ్లీ పరిశీలిస్తాం.

4. నాల్గో హామీ: టీఎంసీ పాలనలో అవినీతికి పాల్పడిన వారు ఎవరైనా సరే మంత్రి అయినా, సాధారణ వ్యక్తి అయినా చట్టం ముందు సమాధానం చెప్పాల్సిందే. ఎవరూ తప్పించుకోలేరు. ఏ ఒక్క టీఎంసీ గూండా కూడా ఇకపై చట్టం నుంచి తప్పించుకోలేడు.

5. ఐదవ హామీ: శరణార్థులకు రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులు ఇస్తాం. అయితే చొరబాటుదారులను దేశంలో ఉండనివ్వం. వారిని బయటకు పంపిస్తాం.

6. ఆరవ హామీ: బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 7వ వేతన సంఘం సిఫారసులను అమలు చేస్తాం. ఈ హామీలతో పశ్చిమ బెంగాల్ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.

‘‘ప్రస్తుతం బెంగాల్‌కు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అత్యంత అవసరం. డబుల్-ఇంజిన్ ప్రభుత్వం బెంగాల్‌ను మత్స్య, సముద్రపు ఆహార రంగాల్లో స్వయం సమృద్ధిగా చేస్తుంది. బీజేపీ మత్స్య రంగానికి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాల తర్వాత మా ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మత్స్యకారులు, వారి కుటుంబాలు, మొత్తం నీలి ఆర్థిక వ్యవస్థ (బ్లూ ఎకానమీ) అవసరాలను తీర్చడానికి ఒక ప్రత్యేక మత్స్య మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడమే కాకుండా మత్స్యకారుల సంక్షేమం కోసం బీజేపీ ప్రత్యేకంగా, రికార్డు స్థాయిలో బడ్జెట్‌ను కేటాయించింది. అంతేకాకుండా బీజేపీ మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) సౌకర్యాన్ని కల్పించింది. బీజేపీ మత్స్యకారులకు రూ. 5 లక్షల వరకు బీమా కవరేజీని కూడా అందించింది. లక్షలాది మంది మన తోటి మత్స్యకారులు ఇప్పటికే ఈ ప్రయోజనాన్ని పొందారు. ఒకసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలో ప్రతి కేంద్ర ప్రభుత్వ పథకం చాలా వేగంగా, సమర్థవంతంగా అమలు చేయబడుతుంది. ’’ అని పేర్కొన్నారు. బెంగాల్‌లో రెండు విడతలుగా పోలింగ్ జరుగుతోంది. 294 స్థానాలకు గాను 152 స్థానాలకు మొదటి విడత పోలింగ్ ఏప్రిల్ 23న జరుగుతుండగా.   142 స్థానాలకు రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది. మే 4న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

Exit mobile version