అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నాయి. ఏదొక సమయంలో ఒప్పందాలు జరిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలొచ్చాయి. అలాంటిది అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందం నిరాకరిస్తోందంటూ రాయిటర్స్ తన కథనంలో ప్రచురించింది. ప్రస్తుతం ఈ కథనం జాతీయంగా.. అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.
రాయిటర్స్ సంచలన కథనం ప్రచురించడంతో తాజాగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై రాయిటర్స్ ప్రచురించిన కథనాన్ని తీవ్రంగా ఖండించారు. అమెరికాతో త్వరితగతిన వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు భారత్ నిరాకరించిందని…మరింత అనుకూలమైన నిబంధనల కోసం వేచి చూస్తోందంటూ వచ్చిన వార్తలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. ఈ అంశంపై సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందించిన పీయూష్ గోయల్.. రాయిటర్స్ కథనాన్ని పూర్తిగా తోసిపుచ్చారు.
‘‘ఈ వార్త పూర్తిగా అసత్యం, నిరాధారం, ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉంది. జూన్‌లో అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ ఢిల్లీకి వచ్చినప్పుడు మా మధ్య అద్భుతమైన సమావేశాలు జరిగాయి. ఇరు దేశాలు సమతుల్యమైన, వాణిజ్యపరంగా ప్రయోజనకరమైన, వ్యాపారాలు, రైతులు, కార్మికులు, వినియోగదారులకు లాభదాయకమైన ఒప్పందం కుదుర్చుకునేందుకు తమ నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించాయి. ఆ లక్ష్య సాధన కోసం ఇరు దేశాల బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి.’’ అని పేర్కొన్నారు.
రాయిటర్స్ కథనంలో ఏముంది?
రాయిటర్స్ తన కథనంలో.. భారత్ ఇటీవల జరిగిన చర్చల్లో అమెరికాతో త్వరితగతిన వాణిజ్య ఒప్పందం చేసుకోవడాన్ని తిరస్కరించిందని.. మరింత మెరుగైన షరతుల కోసం వేచి చూస్తోందని పేర్కొంది. కొత్త వాణిజ్య భాగస్వాములు లభించడం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం, దేశీయ రాజకీయంగా అనుకూల పరిస్థితులు ఉండటంతో ప్రధాని మోడీ ప్రభుత్వం ఈ వైఖరిని అవలంబించిందని అధికారులు, విశ్లేషకుల సమాచారాన్ని ఉటంకిస్తూ రాయిటర్స్ కథనంలో పేర్కొంది.
ఢిల్లీలో సోమవారం నిర్వహించిన వాణిజ్య శాఖ సమావేశంలో కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ కూడా ఈ అంశంపై స్పందించారు. ‘‘భారత్-అమెరికా మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్ సిద్ధంగా ఉంది. సరైన సమయం వచ్చిన వెంటనే ఒప్పందంపై సంతకాలు జరుగుతాయి. మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ప్రతి వాణిజ్య ఒప్పందం పరస్పర ప్రయోజనాలు, పోటీ దేశాలతో పోలిస్తే లభించే అవకాశాల ఆధారంగా ఉంటుంది. ప్రస్తుతం ఆ అంశాలను తుది రూపం ఇస్తున్నాం.’’ అని తెలిపారు.
మరోవైపు భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA)పై చర్చలు ఆశించిన విధంగానే కొనసాగుతున్నాయని రాజేశ్ అగర్వాల్ వెల్లడించారు. ‘‘బీటీఏ చర్చలు సానుకూలంగా సాగుతున్నాయి. ఎలాంటి ఆటంకాలు కనిపించడం లేదు. భారత్ అమెరికా నుంచి ఇంధన దిగుమతులను కూడా పెంచుతోంది. దీంతో దేశ ఇంధన దిగుమతుల్లో వైవిధ్యం పెరుగుతోంది.’’ అని చెప్పారు. అలాగే ‘‘భారత్, అమెరికా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఇరు దేశాలకు ఒకరి అంచనాలు మరొకరికి స్పష్టంగా తెలుసు. ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంలో ఏముంటుందో కూడా ఇరు పక్షాలకు అవగాహన ఉంది. ప్రస్తుతం చర్చలు పూర్తిగా సానుకూల దిశలోనే కొనసాగుతున్నాయి.’’ అని రాజేశ్ అగర్వాల్ స్పష్టం చేశారు.
This news is completely false, baseless and misleading.
I had fantastic meetings with USTR Jamieson Greer, @USTradeRep, when he visited Delhi in June. Both sides reaffirmed their commitment to an agreement that is balanced, commercially meaningful, and delivers tangible… https://t.co/0JZOULEL6i
— Piyush Goyal (@PiyushGoyal) July 13, 2026

