Site icon NTV Telugu

Jagdeep Dhankhar: ధన్‌ఖర్ అధికార నివాసాన్ని సీజ్ చేశారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ

Jagdeepdhankhar

Jagdeepdhankhar

ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖర్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే అనూహ్యంగా రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల చేత రాజీనామా చేసినట్లుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ పంపించారు. అనంతరం రాజీనామాపై పొలిటికల్ దుమారం రేపింది. పెద్దల ఒత్తిడితోనే ఆయన రాజీనామా చేశారంటూ ప్రచారం జరిగింది. తాజాగా ధన్‌ఖర్ ఉంటున్న అధికార నివాసాన్ని అధికారులు సీజ్ చేశారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది.

ఇది కూడా చదవండి: Russia: రష్యాలో విమానం మిస్సింగ్.. ఆందోళనలో ప్రయాణికుల కుటుంబాలు

ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది. అవన్నీ తప్పుడు వార్తలుగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తోసిపుచ్చింది. ఒక వర్గం మీడియా ధన్‌ఖర్ నివాసాన్ని సీలు చేశారంటూ.. తక్షణమే ఖాళీ చేయించిందంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని పీఐబీ కొట్టిపారేసింది. తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని, అధికారికంగా వచ్చిన వార్తలను ధృవీకరించుకోవాలని ప్రజలను కోరింది. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న వాదనలు పూర్తిగా నకిలీవి అని పీఐబీ పేర్కొంది.

ఇది కూడా చదవండి: Bihar Elections: నకిలీ ఓట్లనే తొలగిస్తున్నాం.. నిరసనలపై ఈసీ క్లారిటీ

ఉపరాష్ట్రపతి పదవికి ధన్‌ఖర్ రాజీనామా చేసినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం అధికారికంగా నోటిఫై చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 68లోని క్లాజ్ 2 ప్రకారం ఉపరాష్ట్రపతి మరణం, రాజీనామా లేదా తొలగింపు లేదా ఇతరత్రా కారణాల వల్ల ఖాళీగా ఉన్న పదవిని భర్తీ చేయడానికి ఎన్నిక వీలైనంత త్వరగా నిర్వహించబడుతుందని పేర్కొంది.

ఇదిలా ఉంటే ఉప రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ కోసం ఈసీ కసరత్తు ప్రారంభించింది. ఎలక్టోరల్‌ కాలేజ్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టామని తెలిపింది. పార్లమెంటు ఉభయసభలకు ఎన్నికైన, నామినేటెడ్‌ సభ్యులతో ఈ ఎలక్టోరల్‌ కాలేజ్‌ ఏర్పాటు కానుంది. త్వరలో దీనిపై షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశాలున్నాయి. అధికారిక కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తామని ఎన్నికల సంఘం ఒక ప్రెస్ నోట్‌లో తెలిపింది.

ఈసారి మిత్రపక్షాలకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వొచ్చని పొలిటికల్ సర్కిల్‌లో అనేకమైన పుకార్లు వినిపిస్తు్న్నాయి. ముఖ్యంగా బీహార్‌లో ఈసారి బలం పుంజుకునేందుకు నితీష్ కుమార్‌కు ఉపరాష్ట్రపతి పదవి కట్టబెట్టి.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని వార్తలు వినిపించాయి. ఇక రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్న హరివంశ్‌కు ఇవ్వొచ్చని ప్రచారం జరిగింది. ఇక కాంగ్రెస్‌కు దూరంగా ఉంటూ.. బీజేపీకి దగ్గరగా ఉన్న శశిథరూర్‌కు ఆ పదవి కట్టబెట్టొచ్చని ఊహాగానాలు వెలువడ్డాయి. ఇలా రకరకాలైన పేర్లు వ్యాప్తి చెందుతున్నాయి.

తాజాగా ఈ ఊహాగానాలకు బీజేపీ చెక్ పెట్టింది. ఈసారి ఉపరాష్ట్రపతి పదవిని పార్టీ విధేయులకే ఇస్తారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ భావజాలంతో దగ్గర సంబంధం కలిగి ఉన్న వ్యక్తే తదుపరి ఉపరాష్ట్రపతి అవుతారని చెబుతున్నాయి.

 

Exit mobile version