NTV Telugu Site icon

Manmohan Singh: యాసిన్ మాలిక్‌తో ఫోటో.. మన్మోహన్ సింగ్ జీవితంలో ఓ మచ్చ..

Ysin Malik

Ysin Malik

Manmohan Singh: భారతదేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పథంలో నడిపిన రూపశిల్పి, 10 ఏళ్ల పాటు దేశానికి ప్రధానిగా సేవలందించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. భారతదేశం దివాళా తీసే స్థితి నుంచి ఇప్పుడు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందంటే ఇందులో మన్మోహన్ కృషి మరవలేనిది. 1991 ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ఆర్థిక మంత్రిగా అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. భారత మార్కెట్‌ని లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ చేయడానికి ఆయన ఎన్నో చర్యలు తీసుకున్నారు.

2004-2014 వరకు భారత ప్రధానిగా పనిచేసిన సమయంలో ఆయనపై ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేసినప్పటికీ ఏనాడు కుంగిపోలేదు. మౌనముని అని, కీలుబొమ్మ అని రాజకీయ పార్టీలు విమర్శించినప్పటికీ, ప్రజలు మాత్రం తమ మనిషిగానే భావించారు. రాజకీయాలు ఎలా ఉన్నా కూడా మన్మోహన్ సింగ్ అంటే మచ్చలేని మనిషగా పేరు తెచ్చుకున్నారు.

మన్మోహన్ సింగ్-యాసిన్ మాలిక్ వివాదం:

కానీ, ఒక్క విషయంలో మాత్రం మన్మోహన్ సింగ్‌పై మాయని మచ్చగా మారింది. ఉగ్రవాది, జమ్మూ కాశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్‌ని పీఎం కార్యాలయంలో కలవడం, యువనేత అని మన్మోహన్ సింగ్ ప్రశంసించడం దేశంలో చాలా మందికి నచ్చలేదు. కాశ్మీర్‌లో హిందువుల ఊచకోతతో పాటు భారత జవాన్లను హతమార్చిన నేరాల్లో ప్రమేయం ఉన్న యాసిన్ మాలిక్‌ని కలవడం వివాదాస్పదంగా మారింది. యాసిన్ మాలిక్, ఏనాడు భారతదేశానికి విధేయత చూపించలేదు. పాకిస్తాన్‌కి గట్టి మద్దతుదారు.

జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్ యాసిన్ మాలిక్ ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఉగ్రవాద దాడుల కేసుల్లో అరెస్ట్ అయ్యాడు. ఇదే కాకుండా జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, ఆ తర్వాత హోం మంత్రిగా పనిచేసిన ముఫ్తీ సయీద్ కుమార్తె రుబయ్య సయీద్ కిడ్నాప్‌లో ఇతడి ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. జనవరి 1990లో నలుగురు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారుల్ని హత్య చేసిన కేసులో యాసిన్ మాలిక్ నిందితుడు. భారతవైమానిక దళానికి చెందిన స్వ్కాడ్రన్ లీడర్ రవి ఖాన్నాతో సహా ముగ్గురు మరణించారు. 1990 జనవరి 25న జరిగిన ఈ ఘటనలో మాలిక్ నేతృత్వంలో జరిగిన కాల్పుల్లో ఓ మహిళా అధికారి సహా 40 మంది సిబ్బంది గాయపడ్డారు. 1990లలో కాశ్మీరీ హిందూ మారణహోమానికి నాయకత్వం వహించిన ప్రధాన వ్యక్తులలో మాలిక్ కూడా ఒకరు. కాశ్మీర్‌లో అశాంతికి ప్రధాన కారకుల్లో యాసిన్ మాలిక్ ఒకరు. ఒక ఇంటర్వ్యూలో కాశ్మీరి హిందూ జస్టిస్ గంజూని చంపినట్లు స్వయంగా ఒప్పుకున్నాడు.

మన్మోహస్ సింగ్‌పై మాయని మచ్చ:

అయితే, ఈ అరాచకాలను పక్కన పెట్టిసే, ఆయనను ఓ పోరాట యోధుడిగా కీర్తించే స్థాయికి వెళ్లారు. 2006లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (JKLF) చైర్మన్ యాసిన్ మాలిక్‌ను న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సమావేశానికి ఆహ్వానించారు. జమ్మూ కాశ్మీర్ రాజకీ నాయకులు, వేర్పాటువాదులతో ఆయన చర్చలు జరిపారు. ఆ సమయంలో యాసిన్ మాలిక్‌తో మన్మోహన్ సింగ్ దిగిన ఫోటో ఇప్పటికీ వివాదాస్పదమే. ఈ పరిణామం మన్మోహన్ పాలనలో మచ్చగా మిగిలింది.

ఉగ్రవాద అనుకూలడు, భారత వ్యతిరేకి మాలిక్:

ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో యాసిన్ మాలిక్‌కి యావజ్జీవ శిక్ష పడింది. చాలా సందర్భాల్లో యథేచ్ఛగా పాకిస్తాన్ వెళ్లి అక్కడ ఉగ్రనేతల్ని కలుస్తుండే వాడు. లష్కరే తోయిబా నేత హఫీస్ సయీద్ పాల్గొన్న ఒక కార్యక్రమంలో ఇతను కూడా పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఆ సమయంలో వైరల్ అయ్యాయి. పాకిస్తాన్‌కి చెందిన ముషాల్ మాలిక్‌ని పెళ్లిచేసుకున్నాడు. ఈ పెళ్లి కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ కుదిర్చిందే అనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు పాక్ ఐఎస్ఐ నుంచి ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు స్వీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాలిక్ రూ. 15 కోట్లకు పైగా ఆస్తుల్ని కూడబెట్టినట్లు ఎన్ఐఏ పేర్కొంది. కాశ్మీరీ ఉగ్రవాద గ్రూపులు హిజ్బుల్ ముజాహిదీన్, దుఖ్తరన్-ఎ-మిల్లత్, లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) వంటి పాక్ ఉగ్రవాద సంస్థలతో టచ్‌లో ఉన్నాయని, జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడులు మరియు రాళ్ల దాడులకు స్పాన్సర్ చేయడానికి నిధులు అందుకున్నట్లు అభియోగాలు ఉన్నాయి.

Show comments