దేశంలో వైద్య విద్య సామర్థ్యాన్ని విస్తరించేందుకు కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినేట్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ (CSS) దశ-3 కింద కొత్త సీట్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. క్యాబినేట్ నిర్ణయంతో ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులు, పీజీ ఇనిస్టిట్యూట్లలో 5,000 పీజీ సీట్లు, 5,023 ఎంబీబీఎస్ సీట్లు పెరుగనున్నాయి. ఒక్కో సీటుకు రూ.1.50 కోట్లు వరకు ఖర్చు చేయడానికి కేంద్ర క్యాబినెట్ అనుమతించింది.
కొత్త సీట్ల పెంపుతో ఆర్థిక వ్యయం
మొత్తం వ్యయం: రూ.15,034.50 కోట్లు (2025-26 నుంచి 2028-29 వరకు)
కేంద్ర వాటా: రూ.10,303.20 కోట్లు
రాష్ట్రాల వాటా: రూ.4,731.30 కోట్లు
మెడికల్ సీట్ల పెంపు వల్ల ప్రయోజనాలు
మెడిసిన్ చేయాలనుకునే విద్యార్థులకు ఇక భారత్ లోనే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మన దేశంలో వైద్యుల సంఖ్య పెరగడంతో గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలకు నాణ్యమైన వైద్య సేవలు మెరుగుపడతాయి. తక్కువ ఖర్చుతో మెరుగయిన వైద్యం ప్రజలకు అందుతుంది
కొత్త స్పెషాలిటీల ప్రవేశంతో స్పెషాలిటీ డాక్టర్ల సంఖ్య పెరగనుంది. అనుబంధంగా డాక్టర్లు, ప్రొఫెసర్లు, పారా మెడికల్ సిబ్బంది, పరిశోధకులు వంటి వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయి.
కేంద్ర ప్రభుత్వం 2028-29 నాటికి దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ సంస్థల్లో 5,000 పీజీ సీట్లు, 5,023 యూజీ సీట్లు పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం దేశంలో 808 మెడికల్ కళాశాలలు ఉన్నాయి. మొత్తం ఎంబీబీఎస్ సీట్లు 1,23,700. గత పదేళ్లలో 69,352 ఎంబీబీఎస్ సీట్లు, 43,041 పీజీ సీట్లు పెరిగాయి. అయినా, కొన్నిచోట్ల వైద్య సేవలకు ఇబ్బందులు తలెత్తున్నాయి. ఈ కొత్త పథకాలు ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నాయి.
