అంతర్జాతీయంగా పరిస్థితులు చక్కబడుతున్నాయి. మళ్లీ నార్మల్ స్థితికి వచ్చేలా కనిపిస్తున్నాయి. దాదాపు పశ్చిమాసియా యుద్ధం ముగింపు దశకు వచ్చింది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఇప్పటికే డీజిటల్ సంతకాలు అయిపోయాయి. ఇక ఇరుపక్షాలు సమావేశమై అధికారికంగా సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు మళ్లీ పరిస్థితులు నార్మల్ స్థితికి రానున్నాయి.
ఈ నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో దేశంలోని ఇంధన సరఫరా పరిస్థితిపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఇంధన పరిస్థితి స్థిరంగా ఉందని.. రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని వెల్లడించింది. యుద్ధ పరిస్థితుల సమయంలో కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లో అమ్మకాలు భారీగా పెరిగిన విషయంపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ మాట్లాడుతూ.. వాణిజ్య వినియోగదారులు తమ అవసరాల కోసం రిటైల్ అవుట్‌లెట్లను ఆశ్రయించడం వల్ల కొన్ని బంకుల్లో అమ్మకాలు అధికంగా నమోదయ్యాయని తెలిపారు. “సుమారు 42 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగం రిటైల్ అవుట్‌లెట్లకు మళ్లింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు పెరిగాయి. అయితే దేశంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదు” అని ఆమె స్పష్టం చేశారు.
200 లీటర్ల పరిమితి ఎందుకు?
డీజిల్ నిల్వలు చేసి బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ‘మోటార్ స్పిరిట్ అండ్ హై-స్పీడ్ డీజిల్ (టెంపరరీ రెగ్యులేషన్ ఆఫ్ సప్లై త్రూ రిటైల్ అవుట్‌లెట్స్) ఆర్డర్-2026’ను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఒక వ్యక్తికి గరిష్టంగా 200 లీటర్ల వరకు మాత్రమే ఇంధనం విక్రయించాలి. ఈ నిబంధన తాత్కాలికంగా 90 రోజుల పాటు మాత్రమే అమల్లో ఉంటుందని కేంద్రం తెలిపింది. ఈ ఉత్తర్వు ప్రజలకు ఇంధనం సులభంగా అందుబాటులో ఉండేలా చేయడానికే తీసుకొచ్చామని.. పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా కాదని సుజాతా శర్మ పేర్కొన్నారు.
వినియోగదారులకు ఇబ్బంది లేదు
కేంద్రం ప్రకారం ఈ కొత్త నిబంధనలు సాధారణ వినియోగదారులపై ఎలాంటి ప్రభావం చూపవు. సాధారణంగా కారు లేదా ద్విచక్ర వాహనం ఉపయోగించే వ్యక్తికి 200 లీటర్ల పరిమితి చాలా ఎక్కువగా ఉంటుందని, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2026 మే నెల గణాంకాల ప్రకారం.. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థల (PSU OMCs) రిటైల్ అవుట్‌లెట్లలో డీజిల్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. రిటైల్ అవుట్‌లెట్ల దగ్గర తాత్కాలిక సరఫరా సమస్యల వల్ల వినియోగదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నామని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని మరోసారి స్పష్టం చేసింది.

