NTV Telugu Site icon

Petrol at Rs 1 per litre: అక్కడ రూపాయికే లీటర్‌ పెట్రోల్‌.. మరి ఊరుకుంటారా..?

Petrol

Petrol

పెట్రో ధరలు మంట మండుతున్నాయి.. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో పెట్రో ధరలకు బ్రేక్‌ పడినా.. ఆ తర్వాత 16 రోజుల పాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వడ్డిస్తూ వచ్చాయి చమురు సంస్థలు.. దీంతో.. పెట్రోల్‌ కొట్టించాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి.. డీజిల్‌ పోయించాలంటే.. లెక్కలు వేయించుకోవాల్సిన దుస్థితి వచ్చింది.. అయితే, ఓ పెట్రోల్‌ బంక్‌ యజమానికి నచ్చిన నేత పుట్టిన రోజు రావడంతో.. స్థానికులకు బంపరాఫర్‌ ఇచ్చాడు.. రూపాయికే లీటర్‌ పెట్రోల్‌ అందించాడు.. అయితే, దానికి వెనుక చిన్న షరతులు పెట్టాడు..

Read Also: Centre: కేంద్రం షాకింగ్‌ నిర్ణయం.. 16 యూట్యూబ్ వార్తా ఛానెళ్లు బ్లాక్

ఇక, రూపాయికే లీటర్‌ పెట్రోల్‌ సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర థానే ఘోడ్‌బందర్ రోడ్‌లోని ఓ పెట్రోల్‌ పంప్‌ యజమాని ఈ ఆఫర్‌ తెచ్చాడు.. తనకు నచ్చిన నేత, శివసేన ఎమ్మెల్యే సర్నాయక్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని.. ఇవాళ మాత్రమే ఆ ఆఫర్‌ అందుబాటులో ఉంది.. అది కూడా.. మొదట వచ్చిన వెయ్యి మందికి మాత్రమే రూపాయికే లీటర్‌ పెట్రోల్‌ అందించారు.. దీంతో.. పెట్రోల్‌ కొట్టించుకోవడానికి వాహనదారులు పోటీపడ్డారు.. దీని వెనుక నచ్చిన నేత పుట్టినరోజే కాదు.. వేరే కోణం కూడా ఉంది.. పెరిగిన ఇంధన ధరలకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ఇదో ప్రత్యేక మార్గమని చెబుతున్నారు.. సామాజిక కార్యకర్త సందీప్‌ డోంగ్రే, అబ్దుల్‌ సలామ్‌ సహాయంతో థానే మున్సిపల్‌ మాజీ కార్పోరేటర్‌ ఆశా డోంగ్రే దీని కోసం ప్రత్యేకంగా చొరవ తీసుకున్నట్టు చెబుతున్నారు. మొత్తంగా ఎమ్మెల్యేపై అభిమానం చాటుకోడంతోపాటు.. పెరిగిన పెట్రో ధరలకు నిరసన తెలపడం కూడా ఒకేసారి జరిగిపోయాయి.