New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం దేశవ్యాప్తంగా రాజకీయ రచ్చకు కారణం అవుతోంది. ఇప్పటికే 21 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. ఈ నెల 28న ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం కానుంది. అయితే దీనిని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం అంటే అవమానించినట్లు అని వ్యాఖ్యానిస్తున్నాయి.
Read Also: Sydney: సిడ్నీలో ఘోర అగ్నిప్రమాదం.. కుప్పకూలిన 7 అంతస్తుల భవనం
ఇదిలా ఉంటే ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మే 28న కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ, ఆదివారం జరిగే కార్యక్రమానికి ఆమెను దూరంగా ఉంచడం రాష్ట్రపతిని అవమానించినట్లేనని వాదిస్తూ ఒక న్యాయవాది గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. న్యాయవాది సీఆర్ జయ సుకిన్ గురువారం దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టేందుకు వెకేషన్ బెంచ్ ముందు ప్రస్తావించే అవకాశం ఉంది.
రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్ సభలతో పార్లమెంట్ ఏర్పడుతుందని రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 సూచిస్తుందని.. లోక్ సభ సెక్రటేరియట్, కేంద్రప్రభుత్వం ఆర్టికల్ 79ని ఉల్లంఘించారని న్యాయవాది తన పిటిషన్ లో పేర్కొన్నారు. రాష్ట్రపతి పార్లమెంట్ లో అంతర్భాగం అని ఆర్టికల్ స్పష్టంగా తెలియజేస్తుందని తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఆమెను ఆహ్వానించకుండా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం చట్టప్రకారం జరగదని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కొత్తపార్లమెంట్ ప్రారంభోత్సవానికి అకాలీదల్, నవీన్ పట్నాయక్ పార్టీ బీజేడీ హాజరవుతామని తెలిపాయి.