కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయో అందరికి తెలిసిందే. యజమాని చెప్పిన మాట వింటూ నమ్మకంగా ఉంటాయి. ఒక్కో సారి యజమాని కష్ట సమయాల్లో ఉన్నప్పుడు కాపాడిన కుక్కల గురించి చాలా కథలు విన్నాం. తాజాగా అలాంటి ఘటనే మరోసారి కోల్‌కతాలో జరిగింది. దొంగ బారి నుంచి కుటుంబాన్ని కాపాడటమే కాకుండా.. దొంగను పట్టించింది. దక్షిణ కోల్‌కతాలోని కాళీఘాట్ ప్రాంతంలోని జాదు భట్టాచార్య లైన్ లో ఓ ఇంట్లో దొంగ చొరబడ్డాడు. సదరు ఇళ్లు బెంగాల్ సీఎం ఇంటికి కూతవేటు దూరంలోనే ఉంది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మెయిన్ డోర్ కు ఉన్న గొళ్లెం పగలకొట్టి ఇంట్లో దొంగతనానికి వెళ్లాడు. కొన్ని వస్తువును దొంగిలించడంతో పాటు ఫ్రిజ్ లో ఉన్న ఆహారాన్ని కూడా తిన్నాడు.
Read Also: Assam Floods: వరద గుప్పిట అస్సాం..173కి పెరిగిన మరణాల సంఖ్య
అయితే ఇంట్లో ఎవరో ఉన్నారని గమనించిన మహిళ అరుపులు విని మిగతా కుటుంబ సభ్యులు కూడా మేల్కొన్నారు. ఈ సమయంలో ఇంట్లో ఉన్న ప్రసేన్ జిత్ చక్రవర్తి దొంగను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే దొంగ తన వద్ద ఉన్న కత్తితో ప్రసేన్ పై తీవ్రంగా దాడి చేశారు. అయితే అక్కడే ఓ ట్విస్ట్ జరిగింది. ఇంట్లో ఉన్న రాకీ అనే కుక్క ఒక్కసారిగా దొంగపై దాడి చేయడం ప్రారంభించింది. అతని కాలును కరిచి, మిగతా కుటుంబ సభ్యులు దొంగను పట్టుకునేలా చేసింది. రాకీ చేసిన సాహసాన్ని పోలీసులు కూడా అభినందిస్తున్నారు. దొంగను పట్టుకోవడానికి కారణం పెంపుడు కుక్కే అని చెబుతున్నారు. అయితే దొంగ తనానికి వచ్చిన వ్యక్తి వీధిలో కూరగాయలు అమ్ముకునే వాడిగా గుర్తించారు పోలీసులు. దొంగ దాడిలో గాయాల పాలైన ప్రసేన్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అతని మెడ, భుజానికి తీవ్రగాయాలు కావడం వల్ల 35 కుట్లు పడ్డట్లు పోలీసులు తెలిపారు.