Congress: “జ్ఞానేశ్ కుమార్‌ను అమెరికాకు తీసుకెళ్లండి”.. ట్రంప్ ప్రశంసలపై కాంగ్రెస్ కౌంటర్..

  • భారత ఎన్నికల విధానాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు..
  • భారత CEC జ్ఞానేశ్ కుమార్ వ్యాఖ్యలను ట్రంప్ పోస్ట్..
  • అమెరికాలో SAVE Act ఆమోదానికి ఉదాహరణగా భారత ఎన్నికల విధానం..
  • ట్రంప్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా సెటైర్లు..
  • “జ్ఞానేశ్ కుమార్‌ను అమెరికాకు తీసుకెళ్లండి” అని ఖేరా వ్యాఖ్య.
Trump

Trump

Congress: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎన్నికల విధానాన్ని, ఎన్నికల సంఘాన్ని ప్రశంసించారు. అమెరికాలో సేవ్ యాక్ట్‌ను ఆమోదించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రశంసలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. భారత ఎన్నికల సంఘం(ECI) చేపట్టిన్ SIR ప్రక్రియపై ఇప్పటికే కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా ఓటర్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్‌పై ట్రంప్ ప్రశంసలు కాంగ్రెస్‌లో ఆగ్రహాన్ని పెంచాయి.

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ పవన్ ఖేరా మంగళవారం ట్రంప్‌ను ఉద్దేశించి వ్యంగ్యంగా స్పందించారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ను అమెరికాకు తీసుకెళ్లాలని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (EVMలు) కూడా పంపిస్తామని వ్యాఖ్యానించారు. ‘‘ ప్రియమైన డొనాల్డ్ ట్రంప్, దయచేసి జ్ఞానేశ్ కుమార్‌ను అమెరికాకు తీసుకెళ్లండి. ఆయనను అక్కడే ఉంచుకోండి. మా EVMలను కూడా తదుపరి అందుబాటులో ఉన్న విమానంలో పంపిస్తాం’’ అని కామెంట్స్ చేశారు.

ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్ వేదికగా అమెరికాలో SAVE Actను ఆమోదించాలని మరోసారి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భారత ఎన్నికల విధానం, ఓటర్ల గుర్తింపు అవసరాలను ప్రస్తావించారు.సీఈసీ జ్ఞానేశ్ కుమార్ అమెరికా ఎన్నికల వ్యవస్థపై మాట్లాడినట్లు ట్రంప్ ప్రస్తావించారు. ‘చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీ లేకుండా అమెరికాలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు’ అని జ్ఞానేశ్ కుమార్ తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు ట్రంప్ తెలిపారు. ట్రంప్ భారత్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్ని ప్రస్తావిస్తూ.. దాదాపుగా 64.4 కోట్ల మంది ఓటర్లు ఎన్నికల్లో పాల్గొన్నారని, ఒక శాతానికి కన్నా తక్కువ మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారని, ప్రతీ ఓటర్ కూడా చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు పత్రాన్ని కలిగి ఉన్నారని చెప్పారు.

మరోవైపు, అమెరికాలో సేవ్ యాక్ట్‌ను వెంటనే ఆమోదించాలని ట్రంప్ మరోసారి కాంగ్రెస్‌ను కోరారు. ఈ చట్టం ద్వారా ఫెడరల్ ఎన్నికల్లో కేవలం అమెరికా పౌరులు మాత్రమే ఓటే వేసేలా నిబంధనలు తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారు. ఓటు నమోదు చేసుకునే సమయంలో చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రంతో పాటు పౌరసత్వానికి సంబంధించిన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుందని తెలుస్తోంది. “అమెరికా ఎన్నికలను అమెరికన్ పౌరులు మాత్రమే నిర్ణయించాలి” అని వైట్‌హౌస్ పేర్కొంది.