Site icon NTV Telugu

Parliament Sessions : పునరుత్పాదక ఇంధన రంగంలో వేలాది ఉద్యోగాలు

Vijayasai-Reddy

Vijayasai-Reddy

Parliament Budget Sessions 2nd Phase Tuesday Updates.

రెండో విడత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి మాట్లాడుతూ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్‌లను నెలకొల్పడం ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉద్యోగావకాశాల కల్పన ఏ మేరకు జరిగిందని ప్రశ్నించారు. దీనిపై పునరుత్పాదక ఇంధన రంగంలో దేశవ్యాప్తంగా వేలాది ఉద్యోగావకాశలు కల్పిస్తున్నట్లు ఇంధన మంత్రిత్వశాఖ సహాయ మంత్రి భగవంత్‌ కూబా ప్రకటించారు. సౌర ఇంధన విభాగంలో మూడు మార్గాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మానవ వనరుల శిక్షణ కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టి ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి దేశవ్యాప్తంగా 62,340 మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. 100 అత్యున్నత విద్యా సంస్థలలో ఎంటెక్‌, పీహెచ్‌డీ అభ్యర్ధుల కోసం జాతీయ పునరుత్పాదక ఇంధన ఫెలోషిప్‌ స్కీమ్‌ను అమలు చేస్తున్నట్లు చెప్పారు.

“సూర్య మిత్ర” పథకం కింద 50,806 మందికి శిక్షణ ఇవ్వగా అందులో 53 శాతం మందికి ఉద్యోగాల కల్పన జరిగిందని ఆయన తెలిపారు. “వరుణ్‌ మిత్ర” పథకం కింద సోలార్‌ వాటర్‌ పంప్‌ టెక్నీషియన్లకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. “వాయు మిత్ర” పథకం కింద పవన విద్యుచ్ఛక్తిలో టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. సోలార్‌ ఇంధన రంగంలో ఇప్పటికి దేశంలో 11,500 మెగావాట్ల స్థాపిత సామర్ధ్యానికి చేరుకోగా ప్రతి మెగా వాట్‌కు 2.6 మంది ఉద్యోగాల కల్పన జరిగిందని చెప్పారు. మొత్తంమీద 29,900 మందికి సోలార్‌ విద్యుత్‌ ఉత్పాదన రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించినట్లు మంత్రి వెల్లడించారు.

https://ntvtelugu.com/akbaruddin-owaisi-praised-cm-kcr/
Exit mobile version