దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా పార్లమెంట్ ఉభయ సభలను వేర్వేరు సమయాల్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉ. 10 గంటల నుంచి సా. 3 గంటల వరకు రాజ్యసభ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్‌సభ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం బులిటెన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 1న బడ్జెట్ సమర్పణ కోసం లోక్‌సభ ఉ. 11 గంటలకు సమావేశమవుతుంది. అనంతరం 2వ తేదీ నుంచి సాయంత్రం లోక్‌సభ సమావేశం జరగనుంది.
Read Also: నాసా కీలక అడుగు…లక్ష్యాన్ని చేరుకున్న జేమ్స్ వెబ్
మరోవైపు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు కరోనా కారణంగా హైదరాబాద్‌లో ఉండిపోవడంతో ఆ సభకు సంబంధించిన సమయాలపై అధికారిక ఉత్తర్వులు వెల్లడి కావాల్సి ఉంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉదయం 11 గంటలకు సెంట్రల్ హాల్ నుంచి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగం చేయనున్నారు. సభ్యులు భౌతిక దూరం పాటించేలా రాజ్యసభ, లోక్‌సభ, సెంట్రల్ హాలులో సీట్లు ఏర్పాటు చేశారు.
