NTV Telugu Site icon

Maharashtra: ఎంతటి విషాదం.. భుజాలపై బిడ్డల శవాలతో 15 కి.మీ నడక.. వైరల్ అవుతున్న వీడియో..

Maharashtra

Maharashtra

Maharashtra: మహారాష్ట్రలోని మారుమూల జిల్లా గడ్చిరోలిలో విషాదకరమైన వీడియో వెలుగులోకి వచ్చింది. ఇద్దరు బిడ్డలు విషజ్వరాలతో మరణించడంతో వారి శవాలను భుజాలపై వేసుకుని 15 కి.మీ నడిచి సొంత ఊరికి చేరారు. ఈ సంఘటన సెప్టెంబర్ 4న మారుమూల పట్టిగావ్ గ్రామంలో జరిగింది. 6, 3 ఏళ్ల ఉన్న ఇద్దరు బాలురు సెప్టెంబర్ 4న జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో సరైన వైద్య సదుపాయం లేకపోవడంతో, సాంప్రదాయ నివారణ కోసం వారు తమ పిల్లల్ని ఓ స్థానిక పూజారి వద్దకు తీసుకెళ్లారు. పూజారి కొన్ని మూలిక ఔషదాలు అందించారు, కానీ అప్పటికే పిల్లలిద్దరి ఆరోగ్యం క్షీణించడంతో వారు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు మరణించారు.

Read Also: Goa: విద్యార్థిపై ఇద్దరు టీచర్లు పైశాచికం.. చెప్పుతో కొట్టి, తన్ని

పత్తిగావ్‌ని జిమ్మలగట్టలోని సమీప ఆరోగ్య కేంద్రాన్ని కలిపే రోడ్డు లేకపోవడం, ఆ సమయంలో ఎలాంటి అంబులెన్స్ సేవలు అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు బురద మార్గంలో జిమ్మలగట్ట ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అప్పటికే ఇద్దరూ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వైద్యులు అంబులెన్స్‌ని పిలిచినప్పటికీ, తదుపరి సాయాన్ని తల్లిదండ్రులు నిరాకరించారు. తమ దు:ఖాన్ని దిగమింగుకుని, విగత జీవులైన ఇద్దరు కుమారుల శవాలను భుజాలపై మోస్తూ గ్రామానికి తీసుకువచ్చారు.

గడ్చిరోలి పూర్తిగా అటవీ ప్రాంతం, కొండలతో కూడిన జిల్లా. ఈ జిల్లాలో చాలా గ్రామాలకు సరైన సదుపాయాలు లేవు. భామ్రాగడ్, ఏటపల్లి, అహేరి తహసీల్‌లోని చాలా మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి విషాదాలు జరిగాయి. ఈ విషాదకరమైన వీడియోని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టికార్ పంచుకున్నారు. ఈ ఘటనపై ఆయన బీజేపీ-ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సరైన సదుపాయాలు సమకూర్చలేదని ప్రభుత్వాన్ని నిందించారు.

Show comments