Site icon NTV Telugu

Nitish Kumar: క్షమాపణ చెప్పు లేదంటే చంపేస్తా.. హిజాబ్‌పై నితీష్‌కు పాకిస్థాన్ గ్యాంగ్‌స్టర్ వార్నింగ్

Nitish Kumar

Nitish Kumar

బీహార్‌లో హిజాబ్ వ్యవహారం ముదురుతోంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యవహార శైలిని ఇప్పటికే విపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తుంటే.. ఇప్పుడు దాయాది దేశానికి చెందిన ఓ గ్యాంగ్‌స్టర్ హత్యా బెదిరింపునకు దిగాడు.

ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు షాక్.. మళ్లీ పెరిగిన సిల్వర్, గోల్డ్ ధరలు

పాకిస్థాన్‌కు చెందిన ఒక గ్యాంగ్‌‌స్టర్ షాజాద్ భట్టి వీడియో సందేశం ద్వారా బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను హెచ్చరించారు. వైద్యురాలి హిజాబ్‌ను తొలగించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. లేదంటే చంపేస్తానంటూ బెదిరించాడు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తిస్తాడా? అని ప్రశ్నించాడు. తక్షణమే క్షమాపణ చెప్పాలని కోరాడు. చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉండొచ్చని వార్నింగ్ ఇచ్చాడు. గ్యాంగ్‌స్టర్ వీడియోను పరిశీలిస్తున్నట్లు బీహార్ డీజీపీ వినయ్ కుమార్ అన్నారు. వీడియోపై పాట్నా డీజీ స్థాయిలో విచారణ జరుగుతోందని.. మిగతా విషయాలు తర్వాత పంచుకుంటామని చెప్పారు.

ఇది కూడా చదవండి: Karnataka: కర్ణాటక తీరంలో చైనీస్ సీగల్ కలకలం.. భద్రతపై అనుమానాలు

ఇదిలా ఉంటే నితీష్ కుమార్ చర్యను కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సమర్థించారు. ఎవరైనా అపాయింట్‌మెంట్ లెటర్ తీసుకునేందుకు వస్తే ముఖం చూపించేందుకు ఎందుకు భయపడాలని ప్రశ్నించారు. ఓటు వేసేందుకు వెళ్లేటప్పుడు కూడా ముఖం చూపించాల్సిన అవసరం లేదా? అని గిరిరాజ్‌సింగ్ నిలదీశారు. నితీష్ కుమార్.. హిజాబ్‌ను తీయమని చెప్పడంలో ఏం తప్పుందని అడిగారు. అలాగే బీహార్ మైనారిటీ సంక్షేమ మంత్రి జామా ఖాన్ కూడా వెనకేసుకొచ్చారు. ముస్లిం కుమార్తెపై నితీష్ కుమార్ ప్రేమ చూపించారని.. జీవితంలో విజయం సాధించిన అమ్మాయి ముఖం సమాజం చూడాలని కోరుకోవడంలో తప్పేముందన్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రవర్తనపై విపక్షాలు మండిపడ్డాయి. నితీష్ కుమార్ మానసిక పరిస్థితి దయనీయ స్థితికి చేరిందని.. 100 శాతం సంఘీగా మారిపోయారంటూ ఆర్జేడీ విమర్శించింది. అలాగే కాంగ్రెస్ కూడా మండిపడింది. ఇది నీచమైన చర్య అని.. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇలా చేస్తే.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించింది. ఈ నీచత్వం క్షమించరానిది అని.. వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

అసలేం జరిగిందంటే..
కొత్తగా నియమితులైన ఆయుష్ వైద్యుల నియామక పత్రాల అందజేత కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, మంత్రులు విజయ్ కుమార్ చౌదరి, మంగళ్ పాండే పాల్గొన్నారు. వేదికపైన నియామక పత్రాలు అందజేస్తుండగా ఒక ముస్లిం వైద్యురాలు హిజాబ్ ధరించుకుని వచ్చింది. నితీష్ కుమార్ పత్రాన్ని అందజేసే క్రమంలో వైద్యురాలి హిజాబ్‌ను తొలగించాలని కోరారు. కానీ అంతలోనే ఆమె హిజాబ్‌ను కిందకు గట్టిగా లాగే ప్రయత్నం చేశారు. ఈ హఠాత్తు పరిణామంతో వైద్యురాలు షాక్‌కు గురైంది. అంతేకాకుండా వేదిక దగ్గర ఉన్న నాయకులు, అధికారులు కూడా ఆశ్చర్యపోవడం వంతైంది.

Exit mobile version