Yogi Adityanath: ఛత్తీస్‌గఢ్ కోర్బాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. దేశంలో శాంతిభద్రతల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రధాని నరేంద్రమోడీని కొనియాడారు. ఈ రోజు భారత్‌లో ఎక్కడైనా టపాసులు పేలినా, తమ ప్రమేయం లేదని వివరణ ఇచ్చే స్థాయికి పాకిస్తాన్ వచ్చిందని అన్నారు. ప్రధాని మోడీ పాలనకు 2014కి ముందు కాంగ్రెస్ పాలనకు వ్యత్యాసాన్ని చూపుతూ సీఎం యోగి ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Kaikaluru Constituency : వైసీపీలోకి భారీ చేరికలు.. వైసీపీ తీర్థం పుచ్చుకున్న 400 మంది
కాంగ్రెస్ హయాంలో ప్రజలు ఆకలితో మరణించారని, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, యువత వలసపోయిందని అన్నారు. దేశంలో ఉగ్రవాదులు చొరబడి ఎక్కడైనా బాంబులను పేల్చేవారని, కానీ నేడు దేశంలో ఎక్కడైనా బాణాసంచా పేలినా కూడా పాకిస్తాన్ వివరణ ఇచ్చే పరిస్థితికి తీసుకువచ్చామని చెప్పారు. ఏదైనా దాడి చేస్తే, ఇప్పుడున్న కొత్త భారత్ వారి భూభాగాల్లోకి చొరబడి దాడి చేస్తారని వారికి తెలుసు కాబట్టి, ఏ చిన్న పేలుడు జరిగినా తమ ప్రమేయం లేదని చెబుతోందని అన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి రెండు విడతల్లో ఛత్తీస్‌గఢ్‌లోని 11 పార్లమెంటరీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడతలో బస్తర్ ఎంపీ స్థానానికి ఎన్నికలు జరగగా, ఏప్రిల్ 26న రెండో దశలో రాజ్‌నంద్‌గావ్, మహాసముంద్, కాంకేర్ మూడు ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మే 7న మూడో దశలో 7 నియోజకవర్గాలు – సుర్గుజా, రాయ్‌గఢ్, జంజ్‌గిర్-చంపా, కోర్బా, బిలాస్‌పూర్, దుర్గ్ మరియు రాయ్‌పూర్‌లకు ఎన్నికలు జరుగనున్నాయి. దేశంలోని 543 ఎంపీ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశల్లో ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.