Undivided India: భారత వాతావరణ శాఖ(IMD) నిర్వహించే ‘‘అన్ డివైడెడ్ ఇండియా’’ కార్యక్రమానికి పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను భారత్ ఆహ్వానించింది. భారత వాతావరణ శాఖ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించబడుతున్న సెమినార్‌లో పాల్గొనాలని పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో పాటు ఇతర పొరుగు దేశాలను ఆహ్వానించింది. విభేదాలను పక్కన పెట్టి భారత్, పొరుగుదేశాలు ఆహ్వానం పలికింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్ దేశాలకు ఆహ్వానాలు పంపారు.
ఈ కార్యక్రమానికి పాకిస్తాన్ వస్తామని చెప్పింది. అయితే, బంగ్లాదేశ్ నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. ఒక వేళ బంగ్లాదేశ్ ఈ కార్యక్రమానికి హాజరైతే ఒక చారిత్రాత్మక సంఘటన అవుతుంది. ఈ ప్రత్యేక సమయంలో పరిమిత ఎడిషన్‌లో రూ. 150 స్మారక నాణెం విడుదల చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. గణతంత్ర దినోత్సవం వేడుకల్లో ప్రత్యేక శకటానికి హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది.
Read Also: Same-sex Marriage: స్వలింగ వివాహాలపై రివ్యూ పిటిషన్లను తిరస్కరించిన సుప్రీంకోర్టు..
ఐఎండీ చరిత్ర:
భారత వాతావరణ శాఖ జనవరి 15, 1875న స్థాపించబడింది. అయితే, వాతావరణ అబ్జర్వేటరీలు మాత్రం చాలా ముందుగానే ఏర్పాటు చేయబడ్డాయి. మొదటి వాతావరణ అబ్జర్వేటరీలను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించింది. కలకత్తా అబ్జర్వేటరీ 1785లో, మద్రాస్ అబ్జర్వేటరీ 1796లో, బాంబే అబ్జర్వేటరీ 1826లో ప్రారంభమైంది.
1864లో కలకత్తాను తుఫాను నాశనం చేసిన తర్వాత, 1866, 1871లో రెండు రుతుపవనాల వైఫల్యం తర్వాత బెంగాల్ అంతటా తీవ్రమైన కరువు ఏర్పడింది. దీని తర్వాత 1875లో భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఉనికిలోకి వచ్చింది. వాతావరణ పరిశీలన, సేకరణ, విశ్లేషన ఒకే సంస్థ కింద అంటే ఐఎండీ కింద ప్రారంభమయ్యాయి. 1875లో స్థాపించబడినప్పుడు ఐఎండీ ప్రధాన కార్యాలయం కలకత్తాలో ఉండేది. 1905లో దీనిని సిమ్లాకు, తరువాత 1928లో పూణేకు, చివరికి 1944లో న్యూఢిల్లీకి తరలించారు.
భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో)ని స్థాపించిన సయయంలో, దీనికి సహకరించిన సంస్థల్లో ఐఎండీ మొదటిది. భారతదేశం 24 గంటల వాతావరణ పర్యవేక్షణ, తుఫాను హెచ్చరికల కోసం దాని స్వంత భూస్థిర ఉపగ్రహం INSATను కలిగి ఉన్న మొదటి అభివృద్ధి చెందుతున్న దేశంగా అవతరించింది.