Pak PM: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తానే కారణం అని, తానే మధ్యవర్తిత్వం చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకుంటున్నారు. అయితే, ఇప్పుడు అదే మాటను పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా చెప్పుకుంటున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ప్రధాని షరీఫ్, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లు వైట్ హౌజ్‌లో ట్రంప్‌తో సమావేశమయ్యారు.
Read Also: Tejas Mk-1A: భారత అమ్ముల పొదిలోకి తేజస్ కొత్త మార్క్.. శత్రుదేశాలు వణకాల్సిందే..
ఈ సమావేశం తర్వాత పాకిస్తాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ప్రధానమంత్రి ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిమ్ మునీర్ ఈరోజు ఓవల్ కార్యాలయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జె ట్రంప్‌ను కలిశారు. పాకిస్తాన్-భారతదేశం కాల్పుల విరమణకు దోహదపడినందుకు అధ్యక్షుడు ట్రంప్ యొక్క సాహసోపేతమైన, ధైర్యవంతమైన, నిర్ణయాత్మక నాయకత్వాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. గాజాలో వివాదాన్ని వెంటనే ముగించి మధ్యప్రాచ్యంలో శాంతిని పునరుద్ధరించే ప్రయత్నాలలో కీలక ముస్లిం ప్రపంచ నాయకులను ఆహ్వానించడానికి ఆయన చేసిన చొరవను ప్రశంసించారు.’’ అని ఆ ప్రకటన పేర్కొంది. దీంతో పాటు రెండు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను పెంచుకోవడంపై చర్చించాయని, పాక్ కీలక రంగాల్లో అమెరికా పెట్టుబడులు పెట్టాలని కోరినట్లు, భద్రతా సహకారాన్ని మరింత పెంచుకోవాలని కోరుకున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది.
అయితే, పాకిస్తాన్‌తో కాల్పుల విరమణలో మూడో దేశం ప్రమేయం లేదని భారత్ స్పష్టంగా చెబుతోంది. కానీ, ట్రంప్ మాత్రం తానే సాయం చేసినట్లు పదే పదే చెప్పుకుంటున్నారు. ఇటీవల పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా భారత్ కాల్పుల విరమణలో మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని ఒప్పుకోలేదని చెప్పారు. ఈ ప్రకటనలకు భిన్నంగా తాజా పాకిస్తాన్ ప్రకటన ఉంది.
